
ఎర్రకాలువ తవ్వేశారు
జంగారెడ్డిగూడెం: మట్టి మాఫియా ఎర్రకాలువ జలాశయం గర్భంలో భారీగా తవ్వేసి మట్టిని తరలించేశారు. జలాశయం గర్భాన్ని తెగ తవ్వేశారు. దీంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ మట్టి మాఫియా ప్రధాన సూత్రదారి జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన టీడీపీ నాయకుడు. అంతా తానై ఎర్రకాలువ జలాశయం గర్భాన్ని తవ్వేసి మట్టిని అమ్మేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా రాత్రి సమయాల్లో జేసీబీ పెట్టి తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. పగలు జేసీబీని సమీపంలోని పొలాల్లో పెట్టి.. రాత్రి మట్టి తవ్వేసి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం గర్భంలో మట్టిని తవ్వేసి తరలించేస్తున్నారని సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కొంతమంది దీనిపై ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. మట్టి తరలిస్తున్నారని ఇరిగేషన్ కింది స్థాయి అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం జలాశయాన్ని పరిశీలించాల్సిన అధికారి జలాశయం పరిధిలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. చేపలు పట్టేందుకు మత్స్యకారులు, పశువుల్ని కడిగేందుకు పశువుల కాపరులు ఈ జలాశయంలోకి దిగుతుంటారు. భారీ గోతులు వీరి ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి.

ఎర్రకాలువ తవ్వేశారు

ఎర్రకాలువ తవ్వేశారు