
ప్రభుత్వ జీవోలను వ్యతిరేకించిన ఉపాధ్యాయ సంఘాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ 19 ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. జీఓ 20 ప్రకారం ఉపాధ్యాయుల, విద్యార్థుల నిష్పతిని నిర్ణయిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీఓలపై ధన్యవాదాలు తెలపాలంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం బుధవారం ఏలూరు డీఈఓ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ జీవోలను అన్ని ఉపాధ్యాయ సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని.. వీటిపై ఇప్పటికే కొన్ని సంఘాలు ఆందోళనబాట పట్టాయని, త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కూడా ధర్నాలు చేయడానికి తేదీలు కూడా ప్రకటించామని జిల్లా విద్యాశాఖాధికారికి వివరించినట్టు తెలిసింది. తాము వ్యతిరేకించిన జీఓలను సమర్ధించినట్లు ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని డీఈఓను గట్టిగానే నిలదీసినట్టు తెలిసింది. ఆయా జీవోలపై తమ వ్యతిరేకతను ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళాలని సమావేశంలో డీఈఓను కోరారు.