
జాబ్ కార్డులు ఉన్న అందరికీ పని కల్పించాలి
దెందులూరు: జాబ్ కార్డులు పొందిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. దెందులూరు మండలం సానిగూడెంలో రూ.25 లక్షలతో సాగునీటి అవసరాలకు ఉపయోగపడే 68 ఎకరాలు కొత్త చెరువు నిర్మాణ పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. పని ప్రదేశంలో కూలీలకు తాగునీరు, మజ్జిగ వంటివి అందించాలని, ఎండదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 6 గంటల నుంచే పనులు ప్రారంభించి 10 లోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఎంత మంది పనికి వచ్చారని మస్తరు షీటు పరిశీలించి నలుగురు ఎందుకు రాలేదని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ఏలూరు(మెట్రో): జిల్లాను నాటు సారా రహితంగా తీర్చిదిద్దేందుకు ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఎకై ్సజ్ డీసీ బి.శ్రీలతతో కలెక్టర్ కె.వెట్రిసెల్వి నవోదయం (నాటుసారా నిర్మూలన) కార్యక్రమం ప్రగతి, నాటుసారా వల్ల కలిగే అనర్ధాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సారా తయారీ, రవాణా విక్రయాలు కొన సాగించే వారిపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. మద్యపాన అనర్ధాలపై అవగాహన కలిగించేందుకు ర్యాలీలు నిర్వహించాలన్నారు.