వీరవాసరం: వీరవాసరం మండలంలోని రాయకుదురు, నడపనవారిపాలెంలో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తలుపులు , బీరువాలు పగలగొట్టి వాటిలో ఉన్న 12 ట్యాబ్‌లు దొంగలు పట్టుకుని పోయారు. నడపనివారిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనూ భారీ చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న తలుపులను, హుండీని పగలగొట్టారు. వెండి శఠగోపం, ఉద్దరిణి, పంచ పాత్రలు, పళ్లెం వంటి వెండి సామన్లతో పాటు హుండీలోని సుమారు రూ.25 వేల నగదును చోరీ చేశారు. సంఘటనా ప్రాంతాన్ని భీమవరం రూరల్ సీఐ సిహెచ్ నాగప్రసాద్ సందర్శించారు. క్లూస్ టీం ప్రత్యేకంగా వివరాలు, వేలిముద్ర నమూనాలు సేకరించారు.