
శ్రీవారి ఆలయంలో నేపాల్ మాజీ తొలి ఉప రాష్ట్రపతి పరమానంద్ జ్జ
జంగారెడ్డిగూడెం: గంజాయి రవాణా చేస్తూ విక్రయిస్తున్న నేరంపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పి.బాలసురేష్ బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లా కుంట తాలూకా దోండ్ర గ్రామానికి చెందిన వెట్టి దుర్గ అలియాస్ విక్రమ్ స్థానిక రజక పేటలోని ఎస్‌కే ఇలియాజ్ ఇంటికి 3 కేజీల గంజాయిని తీసుకువచ్చాడన్నారు. గంజాయి సేవించే అలవాటు ఉన్న ఇలియాజ్ అమ్మకాలు కూడా చేస్తున్నాడన్నారు. గరుడ పక్షి నగర్‌కు చెందిన ఆళ్ల రాజేష్ కూడా గంజాయిని సేవించడంతో పాటు అమ్మకాలు చేస్తున్నాడన్నారు. ఆదివారం ఎలియాజ్ ఇంటికి వెట్టి దుర్గ 3 కేజీల గంజాయిని తీసుకువచ్చాడని, అక్కడకు రాజేష్ కూడా వచ్చాడన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎం.సాగర్‌బాబు ఇలియాజ్ ఇంటి వద్ద దాడి చేయగా, 3 కేజీల గంజాయితో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
15 మంది జూదరుల అరెస్టు
ఆగిరిపల్లి: కనసానపల్లిలో పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఎన్.చంటిబాబు సోమవారం తెలిపారు. వారి నుంచి రూ.11,200 నగదు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నెక్కలం గొల్లగూడెంలో, ఎస్.ఏ.పేట గ్రామాల్లో పేకాట, కోడిపందేలపై దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకుని రూ.3,700 నగదు స్వాదీనం చేసుకున్నారు.
కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జీ.నాగమణి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌వీ.రవి సాగర్ అధ్యక్షతన సోమవారం స్థానిక సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాల ఆడిటోరియంలో జిల్లాలోని పదో తరగతి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగమణి మాట్లాడుతూ పరీక్షల సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్యార్థుల దగ్గర గాని, ఇన్విజిలేటర్స్ దగ్గర గాని సెల్‌పోన్లు ఉండరాదని ఆదేశించారు. పరీక్షల జిల్లా పరిశీలకుడు వీ.రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని చెప్పారు.
శ్రీవారి సేవలో నేపాల్ మాజీ ఉప రాష్ట్రపతి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నేపాల్ మాజీ తొలి ఉప రాష్ట్రపతి పరమానంద్ జ్జ సోమవారం రాత్రి సందర్శించారు. ఏలూరులోని ఎన్ కన్వెన్షన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరుగనున్న ఆజాదికా అమృత్ ఉగాది మహోత్సవాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన ముందుగా ఈ క్షేత్రానికి విచ్చేశారు. దాంతో అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ తూర్పు రాజగోపురం వద్ద మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఏఈఓ కేఎల్‌ఎన్ రాజు చినవెంకన్న మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితులతో సీఐ పి.బాలసురేష్ బాబు తదితరులు