యూపీలో మరో ఘోరం

Sakshi Editorial On Another Hathras Incident

తరచుగా ఆడవాళ్లపై నేరాలు జరిగే రాష్ట్రాల్లో అగ్ర స్థానంలో వున్న ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న మరో ఘోరమిది. కుమార్తెను వేధిస్తున్నాడని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశాడన్న కక్షతో ఆమె తండ్రిని పొట్టనబెట్టుకున్న దుండగుడి ఉదంతం సోమవారం చానెళ్లలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ చూసిన వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిరుడు అక్టోబర్‌లో అత్యాచారం ఉదంతం జరిగిన హథ్రాస్‌లోనే ఇది కూడా చోటుచేసుకోవటం గమనించదగ్గది. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా వున్నాయని యోగి ఆరోపిస్తున్న సమయంలోనే బాధితురాలు తన కంఠశోష వినిపించింది. బాధితురాలి తండ్రిని హతమార్చిన దుండగులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపాలని ఈ ఘటన గురించి తెలిశాక యోగి ఆదేశించారు. మంచిదే. కానీ ఈ దారుణానికి దారితీసిన ఘటనల క్రమం గమనిస్తే దుండగుడికి అధికార యంత్రాంగం చివరివరకూ ఎంత వత్తాసుగా నిలిచిందో అర్థమ వుతుంది. 2018 జూలైలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు గౌరవ్‌ శర్మ, అతని ముగ్గురు అనుచరులను అరెస్టు చేయగా, 14 రోజుల్లోనే వారికి బెయిల్‌ వచ్చిందని బాధితురాలు చెబుతోంది. అప్పటినుంచి తనను లైంగికంగా వేధించటం అతనికి నిత్యకృత్యమైందని బాధితురాలు చెబుతోంది. అంటే మూడేళ్లుగా ఆ కుటుంబానిది అరణ్యరోదనే అవుతోంది.

ఈ ఘటన విషయంలో మాత్రమే కాదు...గతంలో జరిగిన ఉదంతాల్లోనూ పోలీసుల తీరు ఇలాగే వుంది. అప్పటికి బీజేపీ ఎమ్మెల్యేగా వున్న కులదీప్‌ సెంగార్‌ 2017లో మైనర్‌ బాలికపై అత్యా చారానికి పాల్పడినట్టు ఆరోపణలొచ్చినా పోలీసులు అతనిపై చర్య తీసుకోలేదు. తనను అపహ రించి, పదిరోజులపాటు అత్యాచారం చేశారని ఆమె మొత్తుకున్నా, ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఈలోగా బాధితురాలి తండ్రిని సెంగార్‌ అనుచరులు బెదిరించి, కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చి, వినలేదన్న ఆగ్రహంతో కొట్టి చంపారు. ఆ తర్వాత బాధితురాలు యోగి నివాసగృహం సమీపంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. బాధితురాలి తండ్రిపై జరిగిన దౌర్జన్యం ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. చివరకు ఈ ఉదంతంలో ఐక్యరాజ్యసమితి సైతం స్పందించాకనే సెంగార్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత బీజేపీనుంచి అతన్ని బహిష్కరించగా 2019లో సెంగార్‌కు యావజ్జీవ శిక్ష పడింది. నిరుడు హథ్రాస్‌ ఉదంతంలోనూ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడింది. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదు చేసిన పక్షం రోజుల వరకూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. అత్యాచారం ఆరోపణ చేర్చడానికి కూడా వెనకాడారు. ఆఖరికి తీవ్ర గాయాలతో ఆమె ఆసుపత్రిలో చేరి, మరణించాక తల్లిదండ్రులు, ఇతర బంధువులు లేకుండానే రాత్రికి రాత్రి అంత్య క్రియలు జరిపించారు.

 అధికారానికొచ్చిన కొత్తలో రాష్ట్రంలో నేరగాళ్లను తుడిచిపెడతానని యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ఆ తర్వాత అనేక ఎన్‌కౌంటర్‌లలో పలువురు మరణించారు. వీటిల్లో అత్యధికం బూటకపు ఎన్‌కౌంటర్లేనని ఆరోపణలొచ్చాయి. ఆ మాటెలావున్నా యూపీలో నేరాలు తగ్గిన దాఖలాలైతే లేవు. నిర్భయ ఉదంతం తర్వాత తీసుకొచ్చిన చట్టం అత్యంత కఠినమైనది. నేరగాళ్లకు ఉరిశిక్ష వేయటానికి కూడా వీలు కలిగించేది. అలాగే పిల్లలపై లైంగిక అత్యాచారాలను నిరోధించేందుకు పోక్సో చట్టాన్ని మరింత కఠినం చేస్తూ సవరణలు తీసుకొచ్చారు. అది కూడా గరిష్టంగా ఉరిశిక్ష వేయడానికి వీలు కల్పిస్తోంది. కానీ వాటిని అమలు చేయాల్సిన యంత్రాంగం నిస్తేజంగా మిగిలితే ఆ చట్టాల వల్ల ప్రయోజనం ఏముంటుంది? హథ్రాస్‌లో జరిగిన తాజా ఉదంతంలో తండ్రిపై కాల్పులు జరిపారని, చావుబతుకుల్లో వున్నాడని బాధితురాలు పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందిస్తే, ‘ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్‌ చేయాల’ని సలహా ఇచ్చి వారు చేతులు దులుపుకున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించటానికి, ఆపద నుంచి కాపాడటానికి ఇలాంటి ప్రత్యేక నంబర్‌ కేటాయిస్తారు. అంతమాత్రంచేత మరో నంబర్‌కు ఫోన్‌ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఇలాంటి నిర్వా్యపకత్వమే దుండగులకు బలాన్నిస్తుంది. వారు మరిన్ని నేరాలకు పాల్పడేలా పురిగొల్పుతుంది. ఇప్పుడు నేరం జరిగాక ప్రధాన నిందితుణ్ణి అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. కానీ ఈ కేసులో ఆదినుంచీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చిన పోలీసులపై చర్యలు లేనట్టయితే ఒరిగేదేమీ వుండదు. అలాగే  దుండగుడికి వెనువెంటనే బెయిల్‌ లభించేందుకు అనువుగా కేసును బలహీన పర్చడానికి కారకులెవరో, ఈ మూడేళ్లుగా అతని ప్రవర్తనపై ఫిర్యాదులున్నా ఆ బెయిల్‌ రద్దుకు ప్రయత్నించకపోవటంలోని ఆంతర్యమేమిటో వెలికితీయకపోతే ఇలాంటి ఘోరాలు ఆగవు. హథ్రాస్‌ తాజా ఉదంతం గురించి అలజడి రేగుతున్న సమయంలోనే అలీగఢ్‌కు చెందిన పదహారేళ్ల దళిత యువతిపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదంటూ అసెంబ్లీలో అలజడి రేగింది. ఇప్పటికైనా యోగి ప్రభుత్వం కళ్లు తెరవాలి. వేరే రాష్ట్రాలకు వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేసినప్పుడు తన ప్రభుత్వ రికార్డు ఎలావుందన్న ప్రశ్నలు తలెత్తుతాయని గ్రహించాలి. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసి, చట్టాలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top