
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఫస్టియర్ విద్యార్థులకు 37 కేంద్రాల్లోను.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ సెకండియర్ విద్యార్థులకు 16 కేంద్రాల్లోను ఈ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 20, 466 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ తదితర సదుపాయాలు కల్పించారు. విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే చేరుకోవాలని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం సూచించారు. ఈ పరీక్షలకు 37 మంది చీఫ్ సూపర్‌వైజర్లు, 37 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఏడుగురు కస్టోడియన్లను నియమించామని తెలిపారు.
డీఎస్సీపై రేపు
అవగాహన సదస్సు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): డీఎస్సీ పరీక్షపై యూటీఎఫ్‌తో కలసి రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ వి.రాంబాబు తెలిపారు. సదస్సు కరపత్రాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ సదస్సుకు పోటీ పరీక్షల నిపుణుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు హాజరై, విలువైన సమాచారం అందిస్తారన్నారు. డీఎస్‌సీ అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోరాట ఫలితంగా డీఎస్‌సీ నోటిఫికేషన్ సాధించుకోగా, నేడు ఓపెన్ కేటగిరీకి అర్హతలు లేవని చెప్పడం దారుణమని అన్నారు. టెక్నికల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని, మన రాష్ట్రంలో కూడా 47 సంవత్సరాల వరకూ వయోపరిమితి పెంచాలని, జిల్లా అంతటా ఒకే పేపర్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే డీఎస్‌సీ అభ్యర్థులతో కలిసి పోరాటాలు చేపడతామని అన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్
చైర్మన్‌గా శేషారావు
ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా జవహర్
నిడదవోలు: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్‌గా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎస్ జవహర్ నియమితులయ్యారు. ఆదివారం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో ఈ విషయం వెల్లడించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గా ఏర్పడిన తర్వాత నిడదవోలు, కొవ్వూరు ని యోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులు బూరుగుపల్లి శేషారావు, కేఎస్ జవహర్‌లు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్లు దక్కకపోవడంతో ఆందోళనలు చేశారు. పొత్తులో భాగంగా నిడదవోలు సీటును జనసేన నుంచి ప్రస్తుత రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌కు కేటాయించారు. అలా గే, కొవ్వూరు నియోజకవర్గంలో బలమైన సామా జిక వర్గానికి చెందిన జవహర్‌ను అణచివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2019, 2024 ఎన్నికల్లో ఆయనకు కొవ్వూరు సీటు ఇవ్వకుండా పక్కన పెట్టారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శేషారావుకు, జవహర్‌కు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం వారి వర్గాలకు కాస్త ఊరటనిచ్చింది.
మండు వేసవిలోనూ
లోవకు భక్తుల తాకిడి
తుని రూరల్: మండు వేసవిలోనూ తలుపులమ్మ అమ్మవారి సన్నిధి వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,24,140, పూజా టికెట్లకు రూ.73 వేలు, కేశఖండన శాలకు రూ.16,130, వాహన పూజలకు రూ.9,860, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలుగా రూ.63,772, విరాళాలు రూ.77,577 కలిపి మొత్తం రూ.3,64,479 ఆదాయం సమకూరిందని వివరించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వేద పండితులు, ప్రధానార్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు.

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు