
పులి దాడిలో గాయపడ్డ ఆవును పరిశీలించి, రైతులతో మాట్లాడుతున్న అటవీ శాఖ అధికారులు
● గాయపడ్డ రెండు ఆవులు, ఒక దూడ
● భయాందోళనలో రైతులు, గ్రామస్తులు
● ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు
ద్వారకాతిరుమల: కొద్ది రోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి శనివారం అర్ధరాత్రి ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలోకి ప్రవేశించింది. ఒక తోటలో కట్టి ఉన్న పశువులపై దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఆవులు, ఒక ఆవు దూడ తీవ్రంగా గాయపడ్డాయి. దాంతో రైతులు, గ్రామస్తులు పులి భయంతో వణికి పోతున్నారు. వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు పాకలపాటి మధు రోజులాగే పశువులను తన పామాయిల్ తోటలో శనివారం సాయంత్రం కట్టేశాడు. తిరిగి పాలు తీసేందుకు ఆదివారం తెల్లవారుజామున తోటలోకి వెళ్లాడు. అయితే ఒక ఆవు కట్లు తెంచుకుని దూరంగా, బెదురు బెదురుగా ఉండడాన్ని ఆయన గుర్తించాడు. దగ్గరకు వెళ్లి చూసేసరికి ఆ ఆవు శరీరంపై గాయాలు కనిపించాయి. అలాగే కట్టి ఉన్న మరో ఆవు, దూడ శరీర భాగాలపై కూడా బలమైన గాయాలు ఉండడాన్ని గమనించాడు. ఆ ప్రాంతంలో పులి పాద ముద్రలు ఉండడంతో భీతిల్లిన మధు విషయాన్ని స్థానిక రైతులకు, అటవీ శాఖ అధికారులకు తెలిపాడు. దాంతో పెద్ద ఎత్తున రైతులు, అటవీ శాఖ రాజమహేంద్రవరం సర్కిల్ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో త్రిమూర్తుల రెడ్డి, ఏలూరు జిల్లా డీఎఫ్‌వో రవీంద్ర ధామా, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ పశువులను పరిశీలించారు. అవి పులి పంజాతో కొట్టడం వల్ల ఏర్పడిన గాయాలేనని అధికారులు నిర్ధారించారు. అలాగే పులి పాద ముద్రలను సేకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు గ్రామంలో మైక్ ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ చేయించారు. పులి సంచరిస్తున్నందున దేవినేనివారిగూడెం, రామన్నగూడెం, చుట్టుపక్కల గ్రామస్తులెవరూ ఒంటరిగా బయట తిరగొద్దని, పొలాలకు వెళ్లే వారు గుంపులుగా వెళ్లాలని సూచించారు.

పులి పాదముద్ర

పులి దాడిలో ఆవుకు అయిన గాయాలు