
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ
చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా సాగుతున్నట్టు డీఐఈఓ డా.ఆదూరు శ్రీనివాసులు తెలిపారు. రెండో రోజు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉదయం మొదటి సంవత్సరం జనరల్‌లో 5,584 మందికిగాను 5,369 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. 215 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో 540 మందికి 494 మంది హాజరుకాగా 46 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షలో 555 మందికి 511 మంది హాజరుకాగా 44 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. ఒకేషనల్‌లో 139 మందికి 125 మంది హాజరుకాగా 14 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. జిల్లాలోని కార్వేటినగరం, చవటగుంట, పెనుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల కేంద్రాలను తాను, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు దయానందరాజు, బాలసుబ్రహ్మణ్యం, శరత్‌చంద్రశేఖర్ 10 కేంద్రాలను, ప్‌లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ 9 కేంద్రాలను తనిఖీ చేసినట్టు డీఐఈఓ వెల్లడించారు.
దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని యువత సివిల్ డిఫెన్స్ వలంటీర్లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న వారు మై భారత్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి బీ.ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖలోని మై భారత్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా యువత దేశానికి ఉపయోగపడే విధంగా, అత్యవసర పరిస్థితుల్లో, సంక్షోభ సమయాల్లో కీలకపాత్ర పోషించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న భద్రతా సమస్యల దృష్ట్యా బలమై న సహజ ఆధారిత ప్రతిస్పందన యంత్రాగాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత భాగస్వామ్యంతో రెస్క్యూ తరలింపు, ప్రథమ చికిత్స, అత్యవసర సంరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పునరావాస ప్రయత్నాల్లో సహాయం చేయడం వంటి సేవల్లో వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తారన్నారు. ఇప్ప టికే మై భారత్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన మై భారత్ వలంటీర్లు, దేశానికి సేవ చేయాలను కునే ఆసక్తి ఉన్న యువత www.mybharay. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
రిజిస్ట్రేషన్లు డల్
చిత్తూరు కార్పొరేషన్: జాతరను పురస్కరించుకొని నగరంలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. పండుగ, మంగళవారం కావడంతో ఎక్కువగా లావాదేవీలు జరగలేదు. కార్యాలయాలు బోసిపోయాయి. చిత్తూరు అర్బన్, రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజూ దాదాపు 50కి తక్కువ కాకుండా డ్యాకుమెంటేషన్లు జరిగేవి. కానీ పండుగ రోజు కావడంతో పెద్దగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ఆసక్తి చూపలేదు. చిత్తూరు అర్బన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 7 రిజిస్ట్రేషన్లు జరగగా రూ.36,000 ఆదాయం వచ్చింది. చిత్తూరు రూరల్ కార్యాలయంలో 9 డ్యాకుమెంట్లుకుగాను రూ.75 వేలు వచ్చింది.
పలువురిపై సస్పెన్షన్ వేటు
కుప్పం: క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు వైఎస్సార్సీపీ నాయకులపై సస్పెన్షన్ వేటు వేసినట్టు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు 1వ వార్డు కౌన్సిలర్ జగదీష్, 3వ వార్డు కౌన్సిలర్ అరవింద్, 4వ వార్డు కౌన్సిలర్ రాజమ్మ, 8వ వార్డు కౌన్సిలర్ చంద్రమ్మ, 13వ వార్డు కౌన్సిలర్ హంస, 14 వార్డు కౌన్సిలర్ మునుస్వామి, 15వ వార్డు కౌన్సిలర్ తిలవతి, 17వ వార్డు కౌన్సిలర్ దేవకి, 21 వార్డు కౌన్సిలర్ లావణ్య, 24 వార్డు కౌన్సిలర్ సయ్యద్‌అలీలను వైస్సార్‌సీపీ నుంచి బహిష్కరించినట్టు పేర్కొన్నారు. వీరితో పాటు శాంతిపురం జెడ్పీటీసీ శ్రీణివాసులు, వసనాడు మాజీ సర్పంచ్ మురళి, మొరసనపల్లె గ్రామానికి చెందిన నీలా జగదీష్, రామకుప్పానికి చెందిన ఆరేల్ల జయప్ప, చీలేపల్లి రవి, ఎస్.కె.సర్దార్ బాషాతో పాటు పలువురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ