
అమెరికాకు ఎగుమతులపై మరో 25% టారిఫ్‌లు నేటి నుంచే అమల్లోకి
కార్మికులు అత్యధికంగా ఉండే రంగాలపై తీవ్ర ప్రభావం
దుస్తులు, తోలు ఉత్పత్తులు, రొయ్యలు, రత్నాభరణాలపై ఎఫెక్ట్
66 శాతం ఎగుమతులకు ప్రతికూలం
రష్యా నుంచి చమురు కొంటున్నామన్న సాకుతో భారత ఎగుమతులపై అమెరికా ప్రకటించిన 25 శాతం అదనపు సుంకాలు నేటి నుంచే (ఆగస్టు 27) అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 25 శాతానికి ఇవి అదనం కావడంతో టారిఫ్‌ల భారం 50 శాతానికి పెరిగినట్లవుతుంది. ఫలితంగా ఎగుమతుల్లో ఏకంగా 66 శాతం వాటాతో, కార్మిక శక్తి అత్యధికంగా ఉండే రొయ్యలు, దుస్తులు, తోలు, రత్నాభరణాల్లాంటి ఎక్స్‌పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది.
‘అమెరికాలో వినియోగానికి భారత్ నుంచి వచి్చన ఉత్పత్తులపై అదనపు సుంకాలు ఆగస్టు 27 ఈస్టర్న్ డేలైట్ సమయం 12:01 గం.ల నుంచి (భారతీయ కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 9.31 గం.లు) వర్తిస్తాయి‘ అని అమెరికా ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీని వల్ల అమెరికా మార్కెట్లో చాలా మటుకు భారతీయ ఉత్పత్తులకు చోటు లేకుండా పోతుందని ఎగుమతిదార్లు ఆందోళన వ్యక్తం చేశారు.
మనకన్నా తక్కువ సుంకాలు వర్తించే బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, కాంబోడియా, ఇండొనేషియా లాంటి దేశాలతో పోటీ పడే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తుల్లాంటి 30 శాతం ఎగుమతులకు మాత్రమే ప్రస్తుతం మినహాయింపు ఉంటుంది. అమెరికా వాణిజ్య గణాంకాల ప్రకారం గతేడాది భారత్ నుంచి ఎగుమతులు 91.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, జీఎస్‌టీ రేట్ల సవరణతో దేశీయంగా వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అమెరికా సుంకాల భారం పడినప్పటికీ భారత్ వృద్ధిపై పెద్దగా ప్రభావం ఉండదని ఆర్థికవేత్తలు తెలిపారు.
ఈసారి 49 బిలియన్ డాలర్లకు డౌన్..
టారిఫ్‌ల భారం వల్ల అమెరికాకు 66 శాతం ఎగుమతులపై (దాదాపు 60.2 బిలియన్ డాలర్ల విలువ) ప్రభావం పడుతుందని మేధావుల సంఘం జీటీఆర్‌ఐ తెలిపింది. ‘ఇటీవలి కాలంలో భారత్‌కి తగిలిన అత్యంత తీవ్రమైన వాణిజ్య షాక్‌లలో ఇదొకటి. 86.5 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతుల్లో మూడింట రెండొంతుల వాటిపై భారీ స్థాయిలో 50 శాతం టారిఫ్‌లు విధించడం వల్ల టెక్స్‌టైల్స్, రత్నాభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్ మొదలైన కార్మిక శక్తి ఎక్కువగా ఉండే రంగాలు పోటీని దీటుగా ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడి ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఈ రంగాల నుంచి ఎగుమతులు 70 శాతం పడిపోయి 18.6 బిలియన్ డాలర్లకు క్షీణించవచ్చు. వేల కొద్దీ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది’ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఎగుమతులు గణనీయంగా 49.6 బిలియన్ డాలర్లకు పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఒకవేళ తర్వాతెప్పుడో టారిఫ్‌లను సవరించినా.. అప్పటికే ఆలస్యమవుతుందని, చైనా, వియత్నాం, మెక్సికోతో పాటు ఆఖరికి పాకిస్తాన్, నేపాల్‌లాంటి దేశాలు కూడా మన స్థానాన్ని ఆక్రమించేసే అవకాశం ఉందని శ్రీవాస్తవ పేర్కొన్నారు.
తిరుపూర్, సూరత్‌లో నిల్చిపోయిన ఉత్పత్తి..
సుంకాల పెంపు కారణంగా తిరుపూర్, నోయిడా, సూరత్‌లోని దుస్తుల తయారీ సంస్థలు ఉత్పత్తి నిలిపివేసినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ ఆదాయ వృద్ధి సగానికి పడిపోయి 3–5 శాతం స్థాయికి పరిమితం కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. దీంతో కంపెనీలు యూరోపియన్ యూనియన్, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లాంటి ఇతరత్రా మార్కెట్ల వైపు చూడాల్సి ఉంటుందని
వివరించింది.
సిబ్బంది.. ఉత్పత్తి కోత ..
అదనపు టారిఫ్‌ల మోత మొదలవుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) స్పష్టత వచ్చే వరకు ఉత్పత్తిని నిలిపివేసి, సిబ్బందిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తోలు, పాదరక్షల పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘మనకు అమెరికానే అతి పెద్ద మార్కెట్ కాబట్టి ఆభరణాలు, వజ్రాల రంగంలో ఉద్యోగాల కోత తప్పదు’ అని రత్నాభరణాల ఎగుమతిదారు ఒకరు తెలిపారు.
ఇలాంటి భారీ టారిఫ్‌లను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ఎగుమతి వ్యూహం అవసరమని పేర్కొన్నారు. వడ్డీ సబ్సిడీ, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, సకాలంలో జీఎస్‌టీ బకాయిలను రిఫండ్ చేయడం, ప్రత్యేక ఆర్థిక మండలి చట్టాన్ని సంస్కరించడం తదితర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 10.3 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసే టెక్స్‌టైల్స్ పరిశ్రమ, టారిఫ్‌ల మోత వల్ల అత్యధికంగా నష్టపోనుందని అపారెల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాకూర్ తెలిపారు.
అనిశ్చితి.. సవాళ్లు
కొన్ని ఉత్పత్తుల విషయంలో సగానికి పైగా ఎగుమతులకు అమెరికా గమ్యస్థానంగా ఉంటోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవడం సవాలుగా మారనుంది. ప్రధానంగా సోలార్ మాడ్యూల్స్ ఎక్స్‌పోర్ట్స్‌లో 98% అమెరికా వాటా ఏకంగా 98%గా (1.6 బిలియన్ డాలర్లు) ఉంది. బ్రిటన్, యూఏఈ, ఆ్రస్టేలియా లాంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నప్పటికీ ఆ మార్కెట్లు ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తులను తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల పెద్దగా ఊరట ఉండకపోవచ్చు. అమెరికాపై అత్యధికంగా ఆధారపడే 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండే ఉన్ని కార్పెట్లు, బెడ్ లినెన్ ఎగుమతులకూ రిసు్కలు నెలకొన్నాయి. సిమెంటు, ఆరి్టఫిషియల్ స్టోన్స్ 88 శాతం ఎగుమతులకు అమెరికానే గమ్యస్థానంగా ఉంటోంది. రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం (సుమారు 420 మిలియన్ డాలర్లు) అగ్రరాజ్యానికే వెళ్తున్నాయి.
ప్రత్యామ్నాయ మార్కెట్లపై ఫోకస్..
ఎగుమతుల కోసం అమెరికాపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేని ఉత్పత్తులు కూడా కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాకు ఎగుమతుల్లో వీటి విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉంటోంది. ఇంద్రనీలం, కెంపులు, న్యూమాటిక్ టైర్లలాంటివి వీటిలో ఉన్నాయి. వీటిని వేరే మార్కెట్ల వైపు మళ్లించే అవకాశం ఉంటుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్