
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్)రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్‌ఆర్‌ఐ) ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను ఇది రియల్ టైమ్‌లో వర్గీకరిస్తుందని పేర్కొంది.
ఆర్‌బీఐ ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని వివరించింది.
డాట్‌లో భాగమైన డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) ఈ ఏడాది మే నెలలో ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఐని ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫోన్‌పే, పేటీఎ మొదలైన దిగ్గజ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్, డాట్‌కు చెందిన చక్షు ప్లాట్‌ఫాంలతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే డేటా ఆధారంగా ఎఫ్‌ఆర్‌ఐ పని చేస్తుంది.
బ్యాంకుల మెరుగైన పనితీరుతో పరపతి మెరుగు
గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌లు మెరుగైన పనితీరు నమోదు చేయడం వాటి పరపతి ప్రొఫైల్‌కు, భవిష్యత్ వృద్ధికి అనుకూలమని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. నాలుగేళ్లలో తక్కువ రుణ వృద్ధి నమోదు అయినప్పటికీ.. మెరుగైన ఆస్తుల నాణ్యత, పటిష్టమైన నగదు నిల్వలు, స్థిరమైన లాభాలను చూపించినట్టు పేర్కొంది.
‘‘ఇక ముందూ స్థిరమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, మిగులు నిల్వలతో నష్టాలను సర్దుబాటు చేసుకోగల సామర్థ్యం ఉండడం, గత సైకిల్‌తో పోల్చితే ఆర్థిక షాక్‌లను తట్టుకుని నిలబడే సామర్థ్యం.. ఇవన్నీ రేటెడ్ బ్యాంకుల స్టాండలోన్ రుణ పరపతికి సానుకూలం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది.
2025–26లో రుణ పరపతి పరంగా బ్యాంక్‌లు స్థిరమైన పనితీరు చూపిస్తాయని పేర్కొంది. 2024–25లో ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1.41 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 26 శాతం ఎక్కువ.