బీమా రంగం పెట్టుబడులకు అనుకూలమేనా?

Is  Life Insurance Sector Is Good For Investments  - Sakshi

డిజిటల్‌గా పంపిణీ పద్దతులు, బలమైన రిస్క్‌ నిర్వహణ విధానాలతో జీవిత బీమా పరిశ్రమ క్లిష్ట సమయాల్లోనూ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కష్టించి పనిచేస్తోంది. గడిచిన ఏడాది కాలంలో పరిశ్రమలో సర్దుబాటు చోటుచేసుకుంది. డిజిటల్, ఈ కామర్స్‌ నమూనాలు ఇటీవలి కాలంలో బీమా పరిశ్రమకు ఫలితాలనిస్తున్నాయి. జీవితంలోని కీలక దశల్లో ప్రజలకు విశ్వసనీయమైన భాగస్వామిగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొనసాగుతోంది.

డిజిటల్‌ వైపు
కరోనా సంక్షోభం ఎన్నో మార్పులకు బీజం వేసింది. భౌతికపరమైన సంప్రదింపులకు బ్రేక్‌ పడడంతో కస్టమర్లు పెద్ద ఎత్తున డిజిటల్‌ వేదికలకు మళ్లారు. దీంతో బీమా సంస్థలు డిజిటల్‌ విధానాలను అందిపుచ్చుకోవడం తప్పనిసరి అయింది. టెక్నాలజీ సదుపాయాల బలోపేతానికి బీమా పరిశ్రమ గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులు కూడా పెట్టింది. దీంతో ముఖ్యమైన వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే వెసులుబాటు లభించింది. కస్టమర్లు బీమా పాలసీల కొనుగోలుకు సంబంధించి వారికి మెరుగైన సేవలు అందించడం సాధ్యపడింది.  

మారకపోయి ఉంటే
2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నూతన పాలసీల ప్రీమియం (న్యూ బిజినెస్‌ ప్రీమియం) గణనీయంగా పడిపోయింది. ఎందుకంటే జీవిత బీమా సంస్థలు, పంపిణీదారులు ఈ తరహా పరిస్థితులకు సన్నద్ధంగా లేరు. దీంతో పంపిణీదారులు డిజిటల్‌గా మారిపోయేందుకు అవసరమైన సాయాన్ని బీమా సంస్థలు అందించాయి. కస్టమర్లతో సంప్రదింపులు మెరుగ్గా ఉండేందుకు డేటా అనలైటిక్స్‌ను వినియోగించడం ద్వారా.. ఈ సవాళ్లను బీమా కంపెనీలు, పంపిణీదారులు సమర్థవంతంగా అధిగమించాయి. డిజిటల్‌కు మారకపోతే పరిశ్రమ 2020–21 తొలినాళ్లలో మాదిరే స్తంభించిపోయే పరిస్థితి అనడంలో సందేహం లేదు.

సమస్యలు కూడా
డిజిటల్‌గా మారిపోవడం వల్ల ప్రయోజనాలున్నా కానీ, సమస్యలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ పరంగా మోసాల రిస్క్‌ కూడా పెరిగింది. చెల్లింపుల నెట్‌వర్క్‌ల దుర్వినియోగానికి అవకాశం ఉండడం, ఇప్పటికే సమాచార తస్కరణ ఘటనలు నమోదవుతుండడం వంటి వాటి రూపంలో పరిశ్రమకు నూతన సవాళ్లు ఏర్పడ్డాయి. అనుమానాస్పద వ్యక్తుల నుంచి అసలైన వినియోగదారులను వేరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వ్యక్తిగత సంప్రదింపులకు అవకాశం లేకపోవడంతో కస్టమర్లకు సంబంధించి రిస్క్‌ను పూర్తిస్థాయిలో అంచనా వేయడం పరిశ్రమకు కఠినమైన సవాలే.

డేటా అనలటిక్స్‌
రిస్క్‌ను ఎదుర్కొనేలా, మోసాలకు చెక్‌ పెట్టేలా బలమైన సదుపాయాల ఏర్పాటు పరిశ్రమకు కీలకంగా మారింది. మోసాలను గుర్తించడంలో డేటా అనలైటిక్స్‌ ఎంతో సాయపడుతోంది. విశ్వసనీయమైన సమాచారం లోపించిన నేపథ్యంలో బీమా పరిశ్రమ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రజలకు టీకాలు ఇస్తుండడంతో భవిష్యత్తు ఆరోగ్యం గురించి మెరుగ్గా అర్థం చేసుకునేందుకు పరిశ్రమ ప్రయత్నిస్తోంది. ప్రజలకు బీమాను మరింత చేరువ చేయడం పరిశ్రమ ముందున్న ప్రాధాన్య అంశం. 

విస్తరణకు అవకాశం
మొత్తంగా రిస్క్‌లను ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్థిక రక్షణ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా (లైఫ్‌ ఇన్సూరెన్స్‌) ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చే విధంగా పరిశ్రమ సైతం సన్నద్ధమవుతోంది. జీడీపీలో 3.76 శాతం వాటాను కలిగిన బీమా పరిశ్రమ విస్తరణ పరంగా చూస్తే ఎంతో వెనుకనే ఉంది. కనుక విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయి.

ఎడెల్‌వీజ్‌ టోకియో లైఫ్‌
 ఎండీ, సీఈవో 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top