పండుగల సీజన్‌లో రుణ వృద్ధిపై దృష్టి   

Finmin reviews PSBs financial performance progress on financial inclusion - Sakshi

 ప్రభుత్వ బ్యాంకింగ్‌కు ఆర్థికశాఖ నిర్దేశం 

సేవల విస్తృతికి ఆదేశాలు

ప్రభుత్వ పథకాల పురోగతిపై బ్యాంకర్ల సమీక్షా సమావేశం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై ఆర్థిక శాఖ కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. బ్యాంకింగ్‌ సేవల విస్తృతి సహా ఉత్పాదక రంగాలకు తగిన రుణ సదుపాయాలు అందించడంపై ఈ సమావేశం దృష్టి సారించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల కథనం ప్రకారం, మొండిబకాయిలు మరింత తగ్గాల్సిన ఆవశ్యకతపై సైతం సమావేశం చర్చించింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో రుణ వృద్ధిపై దృష్టి పెట్టాలని మేనేజింగ్‌ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేసింది.  

బ్యాంకింగ్‌ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 14.2 శాతం నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 6 శాతం. గడచిన త్రైమాసికం (2022 జనవరి–మార్చి)లో ఈ రేటు 10.8 శాతంగా ఉంది. ఎకానమీ పురోగమన బాటలో ఉందనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంసహా కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్, ప్రధాన మంత్రి ముద్ర యోజన, స్టాండ్‌అప్‌ ఇండియా, ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనసహా వివిధ ప్రభుత్వ పథకాల పురోగతిపై సమావేశంలో సమగ్ర సమీక్ష జరిగిందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.  పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలకు రుణాలు ఇవ్వడానికి సంబంధించి బ్యాంకుల పనితీరును కార్యదర్శి సమీక్షించారు. 

మున్ముందూ లాభాల బాటలోనే... 
మొండిబకాయిలు తగ్గడంసహా జూన్‌ నెల్లో మంచి ఆర్థిక ఫలితాలు సాధించిన బ్యాంకింగ్‌ మున్ముందు కాలంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయ్యింది.  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్‌ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్‌ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది.

2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు.  మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్‌బీఐ, పీఎన్‌బీ,  బీఓఐ లాభాలు దాదాపు 7 శాతం మేర క్షీణించాయి.  పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి.  పుణేకు చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్‌ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) నిలిచింది.

బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి.  లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్‌బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది.  మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్‌బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020-21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్‌బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్‌లను ప్రకటించాయి.

బ్యాం  2020-21లో పట్టాలపైకి...
బ్యాంకింగ్‌కు 2020-21 చక్కటి యూ టర్న్‌ వంటిది. 2015-16 నుంచి 2019-20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్‌ మొత్తంగా నష్టాలను నమోదు చేసుకుంది. 2017-18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు,  2019-20లో రూ.25,941 కోట్లు,  2015-16లో రూ.17,993 కోట్లు, 2016-17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్‌ నష్టాల బాట నడిచింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top