డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి రూ.92,248 కోట్లు ఉపసంహరణ!

Debt Mutual Funds See Rs92,248 Crore Outflow In June - Sakshi

న్యూఢిల్లీ: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు జూన్‌ నెలలో అమ్మకాల ఒత్తిడిని చూశాయి. ఇన్వెస్టర్లు ఏకంగా రూ.92,248 కోట్లను డెట్‌ పథకాల నుంచి ఉపసంహరించుకున్నట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగే క్రమం కావడం, అధిక కమోడిటీల ధరలు, వృద్ధి మందగమనం ఇవన్నీ పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. 

ఈ ఏడాది మే నెలలోనూ డెట్‌ పథకాల నుంచి రూ.32,722 కోట్లు బయటకు వెళ్లగా.. ఏప్రిల్‌ నెలలో రూ.54,756 కోట్ల పెట్టుబడులు రావడం గమనించాలి. డెట్‌లో మొత్తం 16 విభాగాలకు గాను, 14 విభాగాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఓవర్‌నైట్, లిక్విడ్, అల్ట్రా షార్ట్‌టర్మ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ ఎక్కువ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ నుంచి రూ.20,668 కోట్లు, లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి రూ.15,783 కోట్లు, అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ నుంచి 10,058 కోట్లు బయటకు వెళ్లాయి. 10 ఏళ్ల గిల్ట్‌ ఫండ్స్, లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లోకి మాత్రమే నికరంగా పెట్టుబడులు వచ్చాయి. మే చివరికి డెట్‌ పథకాల పరిధిలోని నిర్వహణ ఆస్తులు రూ.13.22 లక్షల కోట్లుగా ఉంటే, జూన్‌ చివరికి రూ.12.35 లక్షల కోట్లకు తగ్గాయి. ఇందులోనూ 50 శాతం మేర ఆస్తులు లిక్విడ్, అల్ట్రా షార్ట్‌ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్‌ పథకాల్లోనే ఉన్నాయి.  

అనిశ్చితుల వల్లే.. 
రెపో రేటు, ద్రవ్యోల్బణం పెరుగుతుండడం, ఇన్వెస్టర్ల స్వల్పకాల అవసరాల కోసం పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కారణాలై ఉండొచ్చని ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతిరాతి గుప్తా తెలిపారు. మహిళల కోసమే ఉద్దేశించిన ఫైనాన్షియల్‌ ప్లాట్‌ఫామ్‌ ఎల్‌ఎక్స్‌ఎంఈ. మార్నింగ్‌ స్టార్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ కవిత కృష్ణన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒకే అంకె రాబడికితోడు పెరుగుతున్న బాండ్‌ ఈల్డ్స్, పెరిగే ద్రవ్యోల్బణం వల్ల.. ఇతర పెట్టుబడి సాధనాలకు ఉన్న అనుకూలతలతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికితోడు కార్పొరేట్‌ సంస్థలు, వ్యాపారస్థులు తమ స్వల్పకాల నిధుల అవసరాల కోసం ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడాన్ని ఎంపిక చేసుకుని ఉండొచ్చన్నారు. జూన్‌ నెలలో ఈక్విటీ పథకాలు నికరంగా రూ.15,498 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం తెలిసిందే. సాధారణంగా డెట్‌ పథకాలు తక్కువ రిస్క్‌తో ఉంటాయి. స్వల్పకాల అవసరాల కోసం ఇన్వెస్టర్లు వీటినే ఎంపిక చేసుకుంటారు. రాబడి తగ్గడం, ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురై ఆకర్షణీయ అవకాశాలు అందుబాటులోకి రావడం కూడా పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం చూపి ఉంటాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top