ఊపందుకున్న సంగ్రామం
ఏకగ్రీవ సర్పంచ్‌లు 14, వార్డులు 344!
ఓటర్ల ప్రసన్నం కోసం
మిగిలిన అభ్యర్థుల ప్రయత్నాలు
చుంచుపల్లి/బూర్గంపాడు: తొలి విడతలో ఎన్నికలు జరిగే 159 గ్రామ పంచాయతీలు, 1,436 వార్డులకు నామినేషన్ల ఉపసంహరణ బుధవారంతో ముగిసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ రసవత్తరంగా మారనుంది. పలు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల ఏకగ్రీవం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రలోభాలు, బుజ్జగింపులకు తెరలేపారు. కొన్ని చోట్ల నామినేషన్ల విత్‌డ్రా కోసం బేరసారాలే జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఒకే పార్టీలో ఉంటున్న వారు ఇద్దరిచొప్పున నామినేషన్లు వేయడంతో అక్కడ వారిని బుజ్జగించే విషయంలో ఆయా పార్టీల నాయకులు సఫలమయ్యారు. ఇక ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసిన చోట్ల అంగబలం, అర్ధబలం ఉన్నవారు లోపాయికారంగా ఎంతో కొంత ముట్టజెప్పి ఎదుటి వారి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా చేశారు. మరికొన్ని చోట్ల ప్రస్తుతం నామినేషన్ల నుంచి తప్పుకుంటే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీటీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామనే హామీలతో వైదొలిగారు. దీంతో గ్రామ పంచాయతీలు, వార్డులు కొన్నిచోట్ల ఏకగ్రీవాల వైపే మొగ్గు చూపాయి. ఉపసంహరణల తరువాత అభ్యర్థులకు అధికారులు పేరులో అక్షరమాల ప్రకారం వారికి గుర్తులను కేటాయించారు. తొలి విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గురువారం నుంచి గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేయనున్నారు.
గ్రామాల్లో హోరెత్తనున్న ప్రచారం
గుర్తులు కేటాయించగానే అభ్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. గుర్తులతో కూడిన కరపత్రాల ప్రింటింగ్, ప్రచారానికి అవసరమైన మైక్ పర్మిషన్లు, ఫ్లెక్సీలు, పోస్టర్ల ప్రింటింగ్ కార్యక్రమం చకచకా జరిగిపోతున్నాయి. ప్రచారపర్వంలో పాల్గొనేందుకు వార్డులవారీగా టీమ్‌లను సిద్ధం చేసుకుంటున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోవటంతో గ్రామాల్లో గెలుపోటములపై చర్చలు మొదలయ్యాయి. కొందరు బెట్టింగ్‌లతో సవాల్ విసురుతున్నారు. తొలివిడత ఎన్నికల ప్రచారానికి ఆరురోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కొందరు అభ్యర్థులు తాము గెలిస్తే గ్రామాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తామో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గుర్తులు కేటాయించిన తర్వాత గ్రామాల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఓటర్ల ఇచ్చే హామీలు, తాయిలాలపై అభ్యర్థులు మద్దతుదారులతో సమీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టి ప్రజల మద్దతు కూడగట్టుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అభ్యర్థులకు ఆర్థికభారం కాకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఒప్పందాలు చేసుకుని ఏకగ్రీవాలు చేసుకుంటున్నాయి.
గ్రామపంచాయతీ ఎన్నికల సంగ్రామం ఊపందుకుంది. అన్ని గ్రామాల్లో సందడి మొదలైంది. మొదటి విడత ఎన్నికలు జరిగే 8 మండలాల్లో అభ్యర్థుల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. కడపటి వార్తలు అందే సమయానికి 159 పంచాయతీల్లో 14 జీపీలు, 1,436 వార్డుల్లో 344 వార్డులు ఏకగ్రీవమైనట్లు తేలింది. మిగిలిన 145 జీపీలు, 1092 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక పంచాయతీల్లో ప్రచారం ఉధృతం కానుంది. రెండో విడత నామినేషన్ల గడువు ముగియగా, మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.
ముగిసిన మొదటి విడత ఉపసంహరణలు


