రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం బేడా మండపంలో స్నపన తిరుమంజనం వైభవంగా జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
యువత ఉద్యోగాలు సాధించాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంటౌన్ : భద్రాచలం ఐటీడీఏ వైటీసీ ద్వారా లైట్ మోటార్ వెహికల్, వరంగల్ జోనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కళాశాలలో తీసుకున్న హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న గిరిజన యువకులకు బుధవారం ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవింగ్‌లో పూర్తి అవగాహన ఉన్న యువకులకు భద్రాచలం ఆర్టీఓ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు అందిస్తామని తెలిపారు. వ్యక్తిగత, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయాలని, మత్తు పదార్థాలకు, డ్రంకన్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీఈడీ కళాశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభం
భద్రాచలంటౌన్: పట్టణంలోని బీఈడీ కళాశాలలో ఐటీసీ పేపర్ బోర్డు సహకారంతో రూ.3 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను బుధవారం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరీక్షల పుస్తకాలు సమకూరుస్తామని, టెట్, డీఎస్సీ కోచింగ్ ఇప్పిస్తామని తెలిపారు. డీడీ అశోక్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీరూ నాయక్, డీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, ఐటీసీ అధికారి చెంగల్ రావు తదితరులు పాల్గొన్నారు.
పత్తిపంట కాలాన్ని పొడిగించొద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): పత్తిపంట కాలాన్ని పొడిగించవద్దని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టీ భరత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ చివరి వరకు పత్తితీత పూర్తి చేయాలని రైతులకు సూచించారు. పత్తి పంట సాగును జనవరి వరకు పొడిగిస్తే గులాబీరంగు పురుగు ఉధృతి ఎక్కువై గుడ్డి పత్తి ఎక్కువగా వస్తుందని తెలిపారు. గులాబీ సంతతి పెరిగి వచ్చే సంవత్సరం వేసే పత్తిపంటకు అధిక నష్టం జరుగుతుందని హెచ్చరించారు. పత్తి కట్టెను రోటవేటర్ లేదా షెడ్డర్‌తో కలియదున్నాలని, దీనివల్ల నేల సారవంతమవుతుందని వివరించారు. నేలలో కర్బనశాతం కూడా పెరుగుతుందని తెలిపారు. పత్తికట్టెను కాల్చవద్దని సూచించారు. గులాబీరంగు పురుగు సోకిన పత్తిని నిలువచేయొద్దని, పత్తిని ఏరిన చేనులో గొర్రెలు, పశువులను మేపాలని వివరించారు. నీటి వసతి ఉన్నచోట పత్తి అడుగులో రెండో పంటగా మొక్కజొన్న, జొన్న, బొబ్బర్లు, పెసర, కూరగాయల పంటలను సాగు చేసుకోవాలని సూచించారు.
సింగరేణి విజిలెన్స్
హెచ్‌వోడీగా రాజీవ్‌కుమార్
రుద్రంపూర్: సింగరేణి కార్పొరేట్ విజిలెన్స్ హెచ్‌ఓడీగా రాజీవ్‌కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో విజిలెన్స్ జీఎంగా పనిచేసిన కె.ప్రసాద్‌రావును యాజమాన్యం కార్పొరేట్ మెయిన్ స్టోర్స్‌కు బదిలీ చేసింది. ఆ స్థానంలో కార్పొరేట్ వర్క్‌షాపులో అడిషనల్ జీఎంగా పనిచేస్తున్న పి.రాజీవ్‌కుమార్‌ను బదిలీ చేయగా, బాధ్యతలు స్వీకరించారు. సంస్థ ఆస్తుల పరిరక్షణకు, అవినీతి జరగకుండా నిఘా పెంచుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
రామయ్యకు స్నపన తిరుమంజనం


