దోబీఘాట్లపై నిర్లక్ష్యమేల..?
● రూ.8 కోట్లతో నాలుగు మున్సిపాలిటీలకు మంజూరు ● ఇల్లెందులో 60 శాతం వరకు పూర్తయిన పనులు ● కొత్తగూడెంలో ముందుకు సాగని నిర్మాణం ● ఊసేలేని పాల్వంచ, మణుగూరు దోబీఘాట్లు
ఇల్లెందు: గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మోడ్రన్ దోబీఘాట్లను మంజూరు చేసింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో రూ. 8 కోట్లతో నాలుగు దోబీఘాట్లు నిర్మించాలని కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో ఇల్లెందులో మాత్రమే 60 శాతం మేర పనులు పూర్తయ్యాయి. కొత్తగూడెంలో రెండేళ్ల క్రితం మొదలైన పనులు మొండిగోడలకే పరిమితమయ్యాయి. మణుగూరు, పాల్వంచ పట్టణాల్లో శంకుస్థాపనలు చేసినా పనులు ప్రారంభం కాలేదు. ఇల్లెందులో స్థానిక రజకుల ఒత్తిడితో ఏడాది క్రితం నిలిచిన పనులు మళ్లీ ఇటీవల మొదలయ్యాయి.
ఇల్లెందులో శ్లాబ్ లెవల్ వరకు పనులు
రజకులు ఊరికి మైళ్ల దూరంలో చెరువులు, కుంటలు, వాగుల వద్ద బట్టలు ఉతికి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మోడ్రన్ దోబీఘాట్లను మంజూరు చేసింది. మొదట రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో మున్సిపాలిటీలో రూ.2కోట్లతో ఒక్కో దోబీఘాట్ నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఇల్లెందులో సింగరేణి సహకారంతో ఎనిమిది గుంటల భూమిలో 2023, అక్టోబర్ 8న శంకుస్థాపన చేశారు. శ్లాబ్ వరకు పనులు పూర్తయ్యాక నిర్మాణం నిలిచిపోయింది. ఎట్టకేలకు ఇటీవలే పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దోబీఘాట్‌లోని పైఅంతస్తులో ఫంక్షన్ హాల్ కూడా నిర్మించాల్సి ఉంది. పనులు పూర్తయితే పట్టణంలోని 86 రజక కుటుంబాలతో పాటు పరిసర గ్రామాలకు చెందిన మరో 100 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇక పాల్వంచ, మణుగూరు దోబీఘాట్ల పనులను ఎవరూ పట్టించుకోవడంలేదు. కొత్తగూడెంలో పనులు ప్రారంభమైనా పురోగతి లేదు.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ నిరుపయోగమేనా..?
దోబీఘాట్ కోసం 500 చదరపు గజాల స్థలంలో భవనం, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మిషనరీతో ఏర్పాటు చేయాలని డిజైన్ చేశారు. ఆరోగ్య భద్రతతో పాటు తక్కువ శ్రమ ఉండేలా టెక్నాలజీని ఉపయోగించేలా చేశారు. మురికి బట్టలను యంత్రాల సహాయంతో ఉతికి, అందులోనే ఆరబెట్టే సదుపాయం, చీరెల రోలింగ్ యంత్రాలు, డ్రైక్లీనింగ్ తరహాలో ఈ దోబీఘాట్లు పని చేయాల్సి ఉంది. దోబీఘాట్లన్నీ ఒకే నమూనలో డిజైన్ చేసినా అందుకు తగినన్ని నిధులు లేని కారణంగా ఆ టెక్నాలజీ నిరుపయోగమేననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నిధులున్నవరకే..!
దోబీఘాట్ నిర్మాణానికి సంబంధించి నిధులున్న వరకు పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇల్లెందులో భవనం పైఅంతస్తులో ఫంక్షన్ హాల్ నిర్మించాలని, దోబీఘాట్‌లో మిషనరీలు ఏర్పాటు చేయాలని రజకులు కోరుతున్నారు. ఇటీవల ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారని, తమకు మాత్రం ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని పేర్కొంటున్నారు.
జిల్లాకు నాలుగు దోబీఘాట్‌లు మంజూరురైనా ఒక్క ఇల్లెందులో మాత్రం పూర్తి చేస్తాం. కొత్తగూడెం దోబీఘాట్ నిర్మాణం వదిలేశారు. ఇక మణుగూరు, పాల్వంచలలో మొదలే కాలేదు. ఈ భవనాలు మొదలయ్యే అవకాశం కూడా లేదు. ఇల్లెందులో కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చి పూర్తి చేసేలా ఒత్తిడి చేస్తున్నాం.
– శ్రీనివాస్, డీఈ, పబ్లిక్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్


