నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి
పాల్వంచరూరల్/సుజాతనగర్: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ అబ్జర్వర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం సుజాతనగర్ మండలం సీతంపేట బంజర, గరీభ్‌పేట గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో చేపట్టిన ఆరు గ్రామ పంచాయతీల నామినేషన్ల ప్రక్రియతో పాటు ఓటర్ల జాబితాను పరిశీలించారు. పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో మండలంలోని 36 గ్రామపంచాయతీల పీఓలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థితో పాటు ప్రతిపాదించే ఇద్దరినీ మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్‌లో ఫామ్‌లో ఉండే అన్ని అంశాలను అభ్యర్థులు సక్రమంగా పూరించేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న లోపం రాకుండా బాధ్యతతో, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఎంపీడీఓలు కె.విజయభాస్కర్‌రెడ్డి, బి.భారతి, ఎంపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో
పతకాలు సాధించాలి
క్రీడా పాఠశాలలో విద్యార్థులు అన్ని క్రీడల్లో జాతీయ పతకాలు సాధించాలని గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి సూచించారు. మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి చదువు, ఆటల్లో కసరత్తు తదితర వివరాలు తెలుసుకున్నారు. మెనూ అమలుపై ఆరా తీశారు. పాఠశాల రిజిస్టర్ల నిర్వహణ పత్రాలను పరిశీలించి హెచ్‌ఎంకు పలు సూచనలు చేశారు. అనంతరం క్రీడామైదానాన్ని, పరికరాలను పరిశీలించారు. కోచ్‌లతో మాట్లాడారు. జాతీయస్థాయిలో పతకాలు ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. శిక్షణ మెరుగుపర్చాలని, విలువిద్య కోచ్‌ను, నైపుణ్యం కలిగిన వ్యాయామ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపించాలని స్పోర్ట్స్ ఆఫీసర్‌ను ఆదేశించారు. నూతన క్రీడా సామగ్రి కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ట్రైక్కింగ్ రోప్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. డైరెక్టర్ వెంట ఏటీడీఓ చంద్రమోహన్, హెచ్‌ఎం చంద్ ఉన్నారు.
గిరిజన సంక్షేమశాఖ అడిషనల్
డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి


