అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీ’ | - | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీ’

Jul 4 2025 3:56 AM | Updated on Jul 4 2025 3:56 AM

అమ్మక

అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీ’

● ప్రైవేటు సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకాలకు వసూళ్లు ● ఒక్కో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగానికి రూ.1.50 లక్షలు ! ● డబ్బులు ఇచ్చినా ఉద్యోగం రాక ఓ యువకుడి ఆత్మహత్య ● సదరు ఏజెన్సీపై చర్యలు చేపట్టని సింగరేణి అధికారులు
నా చావుకు వారే కారణం

మణుగూరు టౌన్‌: సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలో ప్రైవేట్‌, ఔట్‌సోర్సింగ్‌ సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు ఇచ్చినా కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఏజెన్సీ ఉద్యోగం ఇవ్వకపోవడంతో బాధితులు మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే పినపాక మండలానికి చెందిన యువకుడు పూనెం సంప్రీత్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ సంఘటన సింగరేణిలో చర్చనీయాంశంగా మారగా, సూసైడ్‌ నోట్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

ఒక్కో పోస్టుకు రూ. 1.50 లక్షలు!

సదరు కంపెనీ 2024లో సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్‌ దక్కించుకోగా, 2025 డిసెంబర్‌తో గడువు ముగియనుంది. పోస్టులకు ప్రారంభం నుంచే డబ్బులు వసూళ్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు సదరు కంపెనీ సూపర్‌వైజర్‌ వసూళ్లు చేసినట్లు సమాచారం. సంప్రీత్‌ కూడా సూపర్‌వైజర్‌ అమరేందర్‌రెడ్డికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నెలలు గడుస్తున్నా ఉపాధి చూపకపోవడంతో పలుమార్లు అడుగగా అమరేందర్‌రెడ్డి ఖాళీ చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. చెక్కు ఇచ్చినా డబ్బులు అందక, ఉపాధి లభించక మరోవైపు అప్పు, వడ్డీలు కట్టలేక సంప్రీత్‌ మనోవేదన చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విప్పలసింగారానికి చెందిన ఓ యువకుడి నుంచి రూ. లక్ష తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కల్పించకపోవడంతో వడ్డీకి తెచ్చిన డబ్బులు కావడంతో కుటుంబ పెద్ద గుండెపోటుతో మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. గతంలో పగిడేరుకు చెందిన కొందరు యువకులు రన్నింగ్‌లో ఎంపికై నా డబ్బులు డిమాండ్‌ చేయడంతో.. వారు సూపర్‌వైజర్‌కు డబ్బులు ఇచ్చి మోసపోయారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించి డబ్బులు తిరిగి పొందారు.

చర్యలు తీసుకోని సింగరేణి యాజమాన్యం

సింగరేణి నిర్వాసితులకు, ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు యాజమాన్యం ప్రైవేటు సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి కల్పిస్తుంది. కానీ సదరు కాంట్రాక్టర్‌ డబ్బులు తీసుకుని స్థానికేతరులను నియమించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై డైరెక్టర్‌(పా), సెక్యూరిటీ జీఎంలకు ఫిర్యాదులు అందినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా సింగరేణి యాజమాన్యం స్పందించి సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు, కార్మిక నాయకులు కోరుతున్నారు. కాగా ఈ వ్యవహారంపై సింగరేణి మణుగూరు ఏరియా డీజీఎం (పర్సనల్‌) సలగల రమేష్‌ను వివరణ కోరగా.. సమస్యపై మురళి మ్యాన్‌ పవర్‌ కంపెనీ బాధ్యులతో చర్చించామని, సమస్యను పరిష్కరించాలని సూచించామని తెలిపారు.

సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడి ఆత్మహత్య

పినపాక: సింగరేణి మణుగూరు ఏరియాలో కాంట్రాక్ట్‌ పద్ధతిన సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏడాది క్రితం డబ్బు వసూలు చేసిన సంస్థ.. ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరం చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పినపాక మండలం పోట్లపల్లి గ్రామానికి చెందిన పూనెం సంప్రీత్‌(25) సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కోసం గతేడాది మురళీ మ్యాన్‌ పవర్‌ కంపెనీకి రూ.1.50 లక్షలు చెల్లించాడు. ఐదారు నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో సంస్థ సూపర్‌వైజర్‌ అమరేందర్‌రెడ్డిని నిలదీశాడు. దీంతో ఆయన సంప్రీత్‌కు ఖాళీ చెక్కు ఇవ్వగా.. ఆ చెక్కు కూడా బౌన్స్‌ అయింది. అయినా కంపెనీ వారు కోర్టు విచారణకు రాకపోవడం, మరోవైపు సంప్రీత్‌ చేసిన అప్పలకు వడ్డీలు పెరుగుతుండడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం పురుగుల మందు తాగగా.. కుటుంబుసభ్యులు భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాగా, ‘అమ్మా, నాన్నా నన్ను క్షమించండి, నా చావుకు మురళీ మ్యాన్‌ పవర్‌ సెక్యూరిటీ ఏజెన్సీనే కారణం, ఏజెన్సీకి చెందిన మురళి, వెంకట్‌, మణికంఠ, అమరేందర్‌రెడ్డే బాధ్యులు’ అంటూ సంప్రీత్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ గురువారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది.

అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీ’1
1/2

అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీ’

అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీ’2
2/2

అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్‌ సెక్యూరిటీ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement