
ఉన్నతంగా రాణించాలి
బూర్గంపాడు: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా రాణించాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. బూర్గంపాడులోని సరస్వతి శిశుమందిర్‌ను గురువారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని వసతులను పరిశీలించారు. విద్యార్థులతో, పాఠశాల నిర్వహకులతో మాట్లాడారు. ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, ఉన్నత లక్ష్యాలను విద్యార్థులకు చిన్నతనం నుంచే నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌గోపాల్, చెంగలరావు, తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య పనుల పరిశీలన
కొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం కొత్తగూడెంలోని జరిగిన పారిశుద్ధ్య పనులను ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ పరిశీలన చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగంలో రికార్డులను పరిశీలించారు. కాగా 2,5,4,20,23 డివిజన్లలో మురుగు కాల్వల్లో సిల్ట్ తొలగించారు. అంతర్గత రహదారులు వెంట ఉన్న చెట్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమాల్లో మేనేజర్ ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, శానిటరీ జవాన్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ములకలపల్లి: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ తెలిపారు. మండల పరిధిలోని కమలాపురం ఆశ్రమ పాఠశాలలో మంగపేట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సికిల్ సెల్ వ్యాఽధి నిర్ధాఽరణ పరీక్షల శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరు పరిశీలించి పలు సూచనలు చేశారు. వైద్యాధికారి సాయికల్యాణ్, ప్రోగ్రాం ఆఫీసర్ మధు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ముష్టికుంట్ల విద్యార్థులు
బోనకల్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో బోనకల్ మండలం ముష్టికుంట్ల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా 90 మంది విద్యార్థులు పాల్గొనగా అండర్ పాఠశాల విద్యార్థులు బొడ్డుపల్లి నవ్యశ్రీ, షేక్ ఫరీదా ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి
పాల్వంచ: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గురువారం ఆటో డ్రైవర్ దాడికి పాల్పడటంతో కేసు నమోదైంది. మణుగూరు నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు పాల్వంచ బస్టాండ్‌లోకి వస్తోంది. ఈ క్రమంలో ఇన్ గేట్ వద్ద ఆటో ఉండటంతో స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో బొల్లేరుగూడేనికి చెందిన ఆటో డ్రైవర్ తరాల సంతోష్ ఆగ్రహంతో బస్సు డ్రైవర్ జక్కం రమేష్‌ను దూషించి, దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.