
నాణ్యమైన విద్యే భవిష్యత్‌కు పునాది
కరకగూడెం: నాణ్యమైన విద్యే భవిష్యత్‌కు పునాది అని జీసీడీఓ అన్నమణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె పినపాక, కరకగూడెం మండలాల్లోని ఎల్చిరెడ్డిపల్లి, భట్టుపల్లి కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. విద్యార్థినుల హాజరు పట్టిక, బోధనా ప్రణాళికలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ఆరోగ్య రికార్డులు తనిఖీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. బోధనా ప్రమాణాలను మెరుగుపరచాలని, పాఠ్యపుస్తకాల లభ్యత, అభ్యసన, వాతావరణం వంటి అంశాలపై విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జి.పద్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.