పాల్వంచరూరల్: భూ వివాదం కారణంగా ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామంలో సాగుచేసిన జామాయిల్ కర్రను సోమవారం నరుకుతుండగా.. నరకవద్దని గ్రామానికి చెందిన ఇట్టి అలివేలు కోరింది. అయినా నరుకుతుండటంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడిపోయింది. దీంతో స్థానికులు, బంధువులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కొత్తగూడెం, ఆ తర్వాత వరంగల్‌కు తరలించారు.
ఎస్‌ఐ బెదిరింపుల వల్లే : సీపీఎం
రూరల్ ఎస్‌ఐ బెదిరింపుల వల్లే అలివేలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సీపీఎం నాయకుడు కె.వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండ్రుగొండ గ్రామంలోని సర్వేనంబర్ 135లో ఆరెకరాల భూమికి సంబంధించిన వివాదంపై ఇటీవల ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయని తెలిపారు. సీపీఐ నాయకుల ఒత్తిడి కారణంగా ఎస్‌ఐ ఓ వర్గానికి కొమ్ముకాస్తూ దొంగపత్రాలు సృష్టించిన వారికి అండగా ఉండి బాధితులకు అన్యాయం చేస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిదని పేర్కొన్నారు.
అసత్యపు ఆరోపణలు : ఎస్‌ఐ సురేష్
నేను ఎవరికీ కొమ్ము కాయడంలేదని, నాపై చేసిన ఆరోపణల్లో నిజంలేదని, ఆధారాలు చూపకుండా అసత్యపు అరోపణలు చేయడం సరికాదని రూరల్ ఎస్‌ఐ సురేష్ తెలిపారు.