
అంతా చెత్తచెత్తగా..!
టేకులపల్లి మండలం దాసుతండా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించి తగలబెడుతున్నారు. ఫలితంగా పర్యావరణం కలుషితమవుతోంది. మరోవైపు డంపింగ్ యార్డు నిర్వహణ సక్రమంగా లేక పిచ్చిచెట్లతో దర్శనమిస్తోంది. మండలానికి ఒకటి, రెండు పంచాయతీల్లో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారే తప్ప మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది.
చుంచుపల్లి: జిల్లాలో చెత్త డంపింగ్ షెడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రామాల్లో పరిశుభ్రతతోపాటు అదనపు ఆదాయం సమకూర్చాలనే ప్రభుత్వ లక్ష్యం అటకెక్కింది. పాలకవర్గాలు లేకపోవడం, పంచాయతీ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో కార్మికులు సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేయడంలేదు. గ్రామాల్లో పరిసరాల శుభ్రతకు ప్రభుత్వం ప్రతి పంచాయతీలో డంపింగ్ యార్డుతో పాటు, సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాలను నిర్మించింది. జిల్లాలో పాత 481 పంచాయతీల్లోనూ నిర్మాణం చేపట్టింది. ఒకో షెడ్డుకు ఉపాధి హామీ నిధుల నుంచి రూ.2.50 లక్షల చొప్పున ఖర్చు చేశారు. ఆ తర్వాత చెత్త సేకరణకు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసుకునేందుకు ఇంటింటికీ చెత్తబుట్టలు అందించారు. పారిశుద్ధ్య సిబ్బంది ఇళ్ల వద్దనే వేర్వేరుగా చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలించాలి. అక్కడ కంపోస్ట్ షెడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో వాటిని పోసి, సేంద్రియ ఎరువుగా మార్చాల్సి ఉంటుంది. కానీ కార్మికులు ఒకే ట్రాక్టర్‌లో తడి, పొడి చెత్తను తరలించి డంపింగ్ యార్డులో పారబోస్తున్నారు. పొడి చెత్తలో లభించే ప్లాస్టిక్ గాజు, ఇనుము ఇతరత్రా సామగ్రిని విభాగాల వారీగా వేరుచేయడం లేదు. చాలా చోట్ల చెత్తను డంపింగ్ యార్డులో పోసి నిప్పు పెడుతున్నారు. తొలుత గ్రామపంచాయతీల్లో వెలువడే చెత్తను సెగ్రిగేషన్ షెడ్ల ప్రాంగణానికి తరలించి సేంద్రియ ఎరువు తయారు చేశారు. ఆ తర్వాత క్రమంగా ఆ ప్రక్రియకు స్వస్తి పలికారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలోనే పంచాయతీల్లో సేంద్రియ ఎరువును తయారీ ప్రక్రియ సాగుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో మిగతా చోట్ల సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. తొట్లలో పిచ్చిమొక్కలు పెరిగాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడకు తరలించాలనే విషయంలోనూ పంచాయతీ కార్యదర్శులకు ఇంత వరకు స్పష్టత లేదు. ప్రజల్లో అవగాహన లేకపోవడం, పంచాయతీల్లో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన సమస్యగా మారింది. పర్యవేక్షణ లోపం కారణంగా ఎరువు తయారీపై స్థానిక సిబ్బంది దృష్టి పెట్టడంలేదు. డంపింగ్ యార్డులు, సేంద్రియ ఎరువుల కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికై నా జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
అలంకారప్రాయంగా సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు
తడి, పొడి చెత్త వేరుచేయకుండా తగులబెడుతున్న కార్మికులు
నిర్వహణలేక పిచ్చిచెట్లతో దర్శనమిస్తున్న డంపింగ్ షెడ్లు
పట్టించుకోని జిల్లా పంచాయతీ అధికారులు
దృష్టి సారిస్తాం..
జిల్లాలోని డంపింగ్ యార్డుల నిర్వహణపై దృష్టి సారిస్తాం. తడి, పొడి చెత్త సేకరణపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాం. కొన్ని చోట్ల డంపింగ్ యార్డుల నిర్వహణ, ఎరువుల తయారీ జరుగుతోంది. మిగిలిన చోట్ల డంపింగ్ యార్డులను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. –వి.చంద్రమౌళి, డీపీఓ

అంతా చెత్తచెత్తగా..!

అంతా చెత్తచెత్తగా..!