
భూ భారతి దరఖాస్తులపై
కలెక్టర్ జితేష్ వి పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం) : భూ భారతి చట్టం కింద రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1,679 భూభారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, నూతన ఆర్‌ఓఆర్ చట్టం నిబంధనలకు అనుగుణంగా పరిష్కంచాలని అన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉపాధ్యాయుల బాధ్యత కీలకం..
పాల్వంచ: ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్థానిక కేజీబీవీలో జరుగుతున్న ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. భవిత కేంద్రాల్లో మౌలిక వసతలు కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి, అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, సీఎంఓ సైదులు, హెచ్‌ఎం మధురవాణి, మంగమ్మ, తులసీ పాల్గొన్నారు.
రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం..
జూలూరుపాడు: రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన మాచినేనిపేటతండా, నర్సాపురం, జూలూ రుపాడులో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించారు. ఉపాధి కూలీలతో కలిసి పని చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కష్టపడి పని చేయడం తనకెంతో ఇష్టమని, టీవీ, సెల్‌ఫోన్‌ల ముందు కూర్చోకుండా యువత పని చేయాలని సూచించారు. గోపాతండాలో బానోత్ చోక్లీ సాగు చేసిన మునగ తోటను పరిశీలించి సాగు ఎలా ఉంది.. కొనుగోలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. మునగకాయలు కొనుగోలు చేసేందుకు పొలం వద్దకే వస్తున్నారని రైతు చెప్పగా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. రైతులంతా మునగ సాగు చేయాలని, ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని చెప్పారు. మండలంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు వేగవంతంగా సాగుతుండగా అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రాలేదని స్థానికులు కలెక్టర్ దృష్టికి తేగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరాయంగా సాగుతుందని, అర్హులందరికీ ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, ఎంపీఓ తులసీరామ్, ఏఓ దీపక్ ఆనంద్, ఎంఈఓ బానోత్ జుంకీలాల్ పాల్గొన్నారు.
వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగూడెంటౌన్: లక్ష్మీదేవిపల్లి మండలం ఎస్‌ఆర్ ప్ర భుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్న వేసవి ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్ సందర్శించారు. నిరంతర సాధనతో ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, కోచ్‌లు ఎండీ అబ్ధుల్ నబీ, ఇమామ్, బిస్వజిత్ కృష్ణ పాల్గొన్నారు.
ఉపాధి పనుల పరిశీలన..
చండ్రుగొండ : మండలంలోని మంగయ్యబంజర్, పోకలగూడెం, రావికంపాడు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్.. ఉపాధి పనులను పరిశీలించారు. పలుగు, పార పట్టి మట్టిపనులు చేస్తూ కూలీల్లో ఉత్సాహం నింపారు. మంగయ్యబంజర్‌లో ఫాంపాండ్ పనులను, పోకలగూడెంలో పంటచేల మధ్య నిర్మాణ దశలో ఉన్న రోడ్డు పనులను పరిశీలించారు. రావికంపాడులో పశువుల షెడ్, మునగతోట, ఇంకుడు గుంలలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బయ్యారపు అశోక్, టెక్నికల్ ఈసీ రాజు, ఏఓ నవీన్, ఎంపీఓ ఖాన్, ఏపీఓ శ్రీను పాల్గొన్నారు.
చండ్రుగొండ : ఉపాధి కూలీతో మాట్లాడుతున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్

భూ భారతి దరఖాస్తులపై