
పనులు ఎన్ని రోజులండి?
రెండేళ్లుగా సాగుతున్న అమృత్ పథకం పనులు
● ధర గిట్టుబాటుకాక కొన్నింటిని నిలిపివేసిన కాంట్రాక్టర్ ● బీడీసీఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు
కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ పథకం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2023లో కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసి రూ. 25.41 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇప్పటివరకు 50 శాతం వరకు పనులు జరిగాయి. టెక్నికల్ సమస్యలతోపాటు ధర గిట్టుబాటు కాలేదని కాంట్రాక్టర్లు వెనకాడటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ భద్రాచలం ఆలయానికి సమీపంలో ఉండటంతో భక్తులు, ప్రయాణికులు ఇక్కడి నుంచి వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. అమృత్ పథకంతో రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు మెరుగుపడతాయని భావించిన ప్రయాణికులకు నిరాశ ఎదురవుతోంది. రెండేళ్లుగా పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రయాణికులకు తప్పనిపాట్లు
భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు మూడు విభాగాలుగా జరుగుతున్నాయి. బిల్డింగ్ వర్క్, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, షీట్ వర్క్స్, స్టేషన్ ముఖద్వారం, ప్రవేశద్వారం, ఆలయ అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. అయితే రేటు గిట్టుబాటు కాకపోవడంతో ఆలయ పనులను సంబంధిత కాంట్రాక్టర్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో స్టేషన్ ముఖద్వారం, ప్రవేశ ద్వారం పనులు కూడా నిలిచిపోయాయి. స్టేషన్‌లో వెయిటింగ్ హాల్ బిల్డింగ్ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. కానీ బాత్‌రూంలకు, రాకపోకలకు సంబంధించిన డోర్‌లు ఏర్పాటు చేయలేదు. విద్యుదీకరణ, వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్, లిఫ్ట్ తదితర పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్లాట్‌ఫామ్ ఉపరితలం, పైకప్పులను అధునాతన షీట్లతో నిర్మించే పనుల్లో కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో సీట్లన్నీ ప్లాట్‌ఫాంపైనే ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్‌లో అక్కడక్కడా జరిపిన తవ్వకాలు అడ్డుగా ఉన్నాయి. స్టేషన్ ముఖద్వారం దగ్గర కూడా అపరిశుభ్రత నెలకొంది. ప్రయాణికుల కుర్చీలు, బల్లల దగ్గర పైకప్పు లేకపోవడంతో ఎండ, వానకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో వర్షం వస్తే ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్ల దగ్గర తలదాచుకుంటున్నారు. రైల్వే అధికారులు స్పందించి అభివృద్ధి, ఆధునికీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కూర్చోవాలన్నా ఇబ్బందే..
భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి డోర్నకల్‌కు వెళ్తున్నాం. మధ్యాహ్నం రైలు వచ్చేందుకు సమయం ఉండటంతో వేచి చూస్తున్నాం. స్టేషన్‌లో కూర్చునేందుకు నీడ కూడా లేదు. వెయిటింగ్ హాల్ పనులు కూడా ఇంకా పూర్తికాలేదు. రైలు వచ్చే వరకు ఎక్కడ వేచి ఉండాలో తెలియడం లేదు.
– ఈర్య, సుజాతనగర్
త్వరగా పూర్తిచేయాలి
భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు నత్తనడకన జరుగుతున్నాయి. స్టేషన్‌లో ఎక్కడ చూసినా పనులకు సంబంధించిన సామగ్రి ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరముంది.
– మారోని, కొత్తగూడెం

పనులు ఎన్ని రోజులండి?

పనులు ఎన్ని రోజులండి?

పనులు ఎన్ని రోజులండి?