
‘విలీనం’ చర్చకొచ్చేనా ?
● సీఎంల భేటీలో పంచాయతీల ప్రస్తావనపై ఆశలు.. ● విలీన గ్రామాలు కలిస్తేనే భద్రాచలానికి మళ్లీ ఊపిరి ● ఐదు పంచాయతీలపై ఇప్పటికే మంత్రి తుమ్మల హామీ ● ఈనెల 6న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం
భద్రాచలం : విభజన అంశాలపై చర్చించేందుకు ఈనెల 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం మండలం నుంచి విడిపోయి ఏపీలో కలిసిన ఐదు గ్రామపంచాయతీల ప్రస్తావనపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ గ్రామాలను తెలంగాణలో కలిపేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆ ఐదు పంచాయతీలకు చెందిన పలువురు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు వినతిపత్రం అందజేశారు.
భద్రాచలంలో అంతర్భాగమే..
తెలంగాణ, ఏపీ విభజనకు ముందు భద్రాచలం డివిజన్‌లో యటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం పంచాయతీలు అంతర్భాగంగా ఉండేవి. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో స్థానికుల అభిప్రాయాలు సేకరించకుండానే ఈ గ్రామాలను ఏపీలో కలిపారు. దీంతో భద్రాచలం విస్తీర్ణం తీవ్రంగా కుచించుకుపోయింది. పట్టణ విస్తరణకు అవకాశం ఉన్న భూభాగం ఏపీలోకి వెళ్లడంతో భద్రాచలం అభివృద్ధి సైతం కుంటుపడింది. భద్రాచలం పుణ్యక్షేత్రంతో పాటు పర్యాటక ప్రాంతంగా, మూడు రాష్ట్రాల గిరిజనులకు వ్యాపార కేంద్రంగా ఉండడంతో నానాటికీ జనాభా సైతం పెరుగుతోంది. అనధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే పట్టణ జనాభా లక్ష దాటింది. దీంతో ఆవాస ప్రాంతాలకు సరైన స్థలం, ప్రభుత్వ అభివృద్ధి పనులకు అవసరమైన స్థలం లేకపోవడంతో ఆ పంచాయతీలను తిరిగి తెలంగాణ లో కలపాలని స్థానికులు అప్పటి నుంచీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. భద్రాచలం దేవస్థానానికి చెందిన సుమారు 900 ఎకరాల భూమి పురుషోత్తపట్నంలోనే ఉంది. దీంతో రామాలయ అభివృద్ధి పనులు సైతం ముందుకు సాగడం లేదు.
ప్రజాప్రతినిధులకు వినతులు..
ఏపీలో కలిసిన విలీన గ్రామాల ప్రజలు సైతం తమను తిరిగి తెలంగాణ లో కలపాలని కోరుతున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులకు, తెలంగాణ ప్రజాప్రతినిధులకు వినతులు సమర్పి స్తూనే ఉన్నారు. పలుమార్లు రాస్తారోకోలు, మానవహారాలు, బంద్ వంటి కార్యక్రమాలతో నిరసన తెలిపారు. ఎన్నికల వేళ సైతం ఈ అంశం అన్ని పార్టీలకూ అస్త్రంగా మారింది. తాజాగా మంగళవారం కూడా ఆయా గ్రామాల వారు స్థానిక ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. మళ్లీ గోదావరి వరదల సీజన్ రానుందని, ఇప్పటికే తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఏపీలోని జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో ఏ పని ఉన్నా అంతదూరం వెళ్లలేకపోతున్నామని ఆయన దృష్టికి తెచ్చారు. భౌగోళికంగా భద్రాచలంతో తమకు అనుబంధం ఉందని, రాష్ట్రాలు వేరు కావడంతో పిల్లల చదువులు, ఉద్యోగాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు.
సీఎంల భేటీలో చర్చించేనా..
రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 6న ఇరు రాష్టాల సీఎంలు భేటీ కానున్నారని తెలుస్తోంది. దీంతో భద్రాచలం నుంచి విడిపోయిన ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్‌పై చర్చించాలని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ అంశాన్ని ఇద్దరు సీఎంల దృష్టికి తీసుకెళ్తానని జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఇటీవల హమీ ఇచ్చారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ సైతం ఎన్నికల ప్రచారంలో భరోసా ఇచ్చారు. ఈ మేరకు అందరూ సమష్టిగా కృషి చేసి, ఈ సమస్య పరిష్కరించాలని అంటున్నారు.