
ఘనంగా రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక సోమవారం కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు దగ్గర పడుతుండటంతో అధిక సంఖ్యలో భక్తులకు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించే గోదావరి తీరంలో సందడి నెలకొంది.
వైభవంగా సుదర్శన హోమం
శ్రీసీతారామచంద్ర స్వామివా రి దేవస్థానంలో చిత్త నక్షత్రం సందర్భంగా సోమవారం సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని హోమశాలలో అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
23న ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్
మణుగూరురూరల్/భద్రాచలంటౌన్: గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 23న భద్రాచలం కళాశాలలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు భద్రాచలం, మణుగూరు కళాశాలల ప్రిన్సిపాల్స్ ఎం.దేవదాసు, పద్మావతి సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్ గ్రూపుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. టీసీ, స్టడీ, కులం, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, నాలుగు జిరాక్స్ సెట్లు, ఫొటోలు తీసుకుని ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. 2023–24లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు.
ఆర్చరీ శిక్షణా కేంద్రానికి రికర్వ్ బో..
సూపర్‌బజార్(కొత్తగూడెం): పాల్వంచ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా ఉచిత ఆర్చరీ శిక్షణా కేంద్రానికి రూ 3.50 లక్షల విలువైన రికర్వ్ బోను జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల చేతుల మీదుగా ఆర్చరీ కోచ్ టి.కల్యాణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణా పరికరాలను ఉపయోగించుకుని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలన్నారు. కాగా శిక్షణా కేంద్రంలో 38మంది క్రీడాకారులు ఆర్చ రీ శిక్షణ పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎ.పరంధామరెడ్డి, ఆర్.ఉదయ్‌కుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
బీఏఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలి
భద్రాచలంటౌన్: జిల్లాలోని గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) ద్వారా 3, 5, 8 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. 2024–25 విద్యాసంవత్సరానికి మూడో తరగతిలో 61 సీట్లు, ఐదో తరగతిలో 30 సీట్లు, ఎనిమిదో తరగతిలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దమ్మపేట, భద్రాచలం, ఇల్లెందు సహాయ గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయాల నుంచి దరఖాస్తు ఫారాలు పొందవచ్చని తెలిపారు. కులం, నివాసంతోపాటు తల్లిదండ్రుల వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుకు జతపరిచి జూన్ 6 వరకు ఐటీడీఏ భద్రాచలం కార్యాలయంలో అందజేయాలని సూచించారు. జూన్ 12న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

ఘనంగా రామయ్య కల్యాణం

ఘనంగా రామయ్య కల్యాణం