రాజాధిరాజుగా..

- - Sakshi

భద్రాద్రి రామయ్యకు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం

● మిథిలా స్టేడియంలో కనుల పండువగా వేడుక ● పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ తమిళి సై ● వేడుకను తిలకించిన వేలాది మంది భక్తులు

శనివారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2023

శ్రీసీతారాముల పట్టాభిషేకం అనంతరం సింహాసనంపై బంగారు ఛత్రం అమరుస్తున్న అర్చకులు

రాజముద్రికను చూపిస్తున్న అర్చకుడు

స్వర్ణ సింహాసనంపై రారాజుగా..

శ్రీ సీతారాముల కల్యాణం జరిగిన మరుసటి రోజున స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది పుష్కర సామ్రాజ్య మహా పట్టాభిషేకోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 22 నుంచే యాగశాలలో ప్రత్యేక పూజలకు అంకురార్పణ చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం యాగశాలలో చతుఃస్థానార్చన హోమం నిర్వహించారు. 10 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవగా మేళాతాళాలతో మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. మహాపట్టాభిషేక క్రతువు సజావుగా సాగాలంటూ మొదట విశ్వక్సేన పూజ చేశారు. పూజా ద్రవ్యాలకు పట్టాభిషేక యోగ్యత కలగాలని పుణ్యావాచనం, సంప్రోక్షణ చేశారు. దైవాలలో ఒక్క శ్రీరాముడికి తప్ప మరెవరికీ పట్టాభిషేకయోగం లేదని అర్చకులు స్వామివారి ఔన్నత్యాన్ని వివరించారు. పుష్కర పట్టాభిషేకం సందర్భంగా అర్చకులు బృందాలుగా విడిపోయి దేశంలోని మూడు సముద్రాలు, 12 నదులు, 12 పుష్కరిణుల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అష్టోత్తర, సహస్ర నామార్చన, సువర్ణ పుష్పార్చన గావించారు. మండపంలో పంచ కుండాత్మక–పంచేష్ఠి సహిత చతుర్వేద హవన పురస్కృతంగా వేదపండితులు క్రతువు నిర్వహించారు. స్వామివారికి దాతలు సమర్పించిన స్వర్ణ తాపడ సింహాసనంపై కొలువుదీర్చడం, రామయ్యతో పాటు సీతమ్మ వారికీ స్వర్ణ మకుటధారణ చేయ డం ఈ ఏడాది ఉత్సవాల్లో ప్రత్యేకతగా నిలించింది.

రామయ్య పట్టాభిషిక్తుడైన వేళ..

మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత స్వర్ణ సింహాసనంపై స్వర్ణ ఛత్ర, స్వర్ణ పాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్రకిరీటాలను భక్తులకు చూపిస్తూ స్వామివారికి అలంకరించారు. నాటి మహర్షులు, అష్టదిక్పాలకులు, శ్రీరాముని సేనను వివరిస్తూ రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుడిని చేశారు. త్రేతాయుగంలో శ్రీరాముని మహాపట్టాభిషేకం స్మరణకు వచ్చేలా అదే చైత్ర పుష్యమి ముహుర్తాన భద్రాచలంలో పట్టాభిషేకం జరిపారు. యావత్‌ లోకానికి రామరాజ్య పాలన ఆదర్శంగా నడిచిందని, అదే పాలనతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు పట్టాభిషేకం నిర్వహించటం అనవాయితీగా వస్తోందని అర్చకులు, వేద పండితులు తెలిపారు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా అహోబిల జీయర్‌స్వామి, దేవరాజ జీయర్‌స్వామి హాజరయ్యారు. కాగా, సాయంత్రం జరగాల్సిన రథోత్సవాన్ని వర్షం కారణంగా రద్దు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ డాక్టర్‌ వినీత్‌, గవర్నర్‌ సెక్రటరీ సురేంద్రమోహన్‌, ఐటీడీఏ పీఓ గౌతమ్‌ పొట్రు, అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓ రత్న కళ్యాణి, ఆలయ ఈఓ రమాదేవి, మాజీ ఈఓ శివాజీ, ఈఈ రవీందర్‌, ఏఈఓ భవాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భద్రాచల దివ్యక్షేత్రం అయోధ్యపురిగా మారింది. సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు రాజాధిరాజుగా పట్టాభిషేకం చేసేందుకు మిథిలా స్టేడియం వేదికగా మారింది. రామచంద్రస్వామితో పాటు సీతమ్మవారు కూడా స్వర్ణ కిరీటాన్ని ధరించిన మధుర దృశ్యాలు తిలకించిన భక్తులు జేజేలు పలికారు. శ్రీరామ నామస్మరణలతో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం శుక్రవారం కనులపండువగా జరిగింది. – భద్రాచలం

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పూజలు

రాష్ట్ర, దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని శ్రీసీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశాం. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇదే పాలనను మున్ముందు కూడా అందించాలని, ఆయనకు రాముడు సంపూర్ణ ఆరోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థన చేశాం. – సత్యవతి రాథోడ్‌,

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top