
వృద్ధాప్యంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి
చీరాల అర్బన్: వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మీపద్మావతి అన్నారు. స్థానిక మహిళా మండలిలో నాలుగు రోజులుగా వృద్ధాప్య కేంద్రాల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి హాజరై, ఆమె మాట్లాడారు. వృద్ధుల సేవలో మమేకం అయినప్పుడే మనం చేసే సేవ సార్థకం అవుతుందన్నారు. తన సుదీర్ఘ సేవా ప్రయాణం అత్యంత తృప్తి ఇచ్చిందన్నారు. శిక్షణ కార్యక్రమంలో హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున ప్రాజెక్టు హెడ్ టి.రవి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను సమాజసేవకు కూడా ఉపయోగించాలన్నారు. శిక్షణ పొందిన వారిచే ప్రతిజ్ఞ చేయించి, సర్టిఫికెట్లు అందించారు. 18 సంస్థల బాధ్యులు, వారి సిబ్బంది తమకు స్ఫూర్తిగా నిలిచిన లక్ష్మీపద్మావతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మహిళా మండలి మేనేజర్ శ్రీనివాసరెడ్డి, ఎన్‌జీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మీపద్మావతి