
దుకాణాల కూల్చివేతపై ఉద్రిక్తత
● వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణం కూల్చివేత ● ప్రశ్నించిన నాయకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
భట్టిప్రోలు(కొల్లూరు): ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు, ఇతర నిర్మాణాలు కూల్చివేతపై ఉద్రిక్తత నెలకొంది. భట్టిప్రోలు బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ భూమిలో ఉన్న చికెన్ దుకాణంతోపాటు, మరికొన్ని నిర్మాణాల తొలగింపునకు ప్రభుత్వ యంత్రాంగం మంగళవారం పూనుకుంది. ఈక్రమంలో తమకు ముందస్తు నోటీసులు అందజేయకుండా ఉన్న పళంగా కూల్చివేతలు చేపట్టడంపై చికెన్ దుకాణం నిర్వాహకుడు, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం మాజీ కార్యదర్శి అరుణశాస్త్రి అధికారుల వద్ద అభ్యంతరం వ్యక్తం చేశాడు. పంచాయతీలో కొన్నేళ్ల కిందట దుకాణం నిర్వహించుకునేందుకు తీర్మానం చేసినట్లు అధికారులకు తెలియజేయడంతోపాటు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడ్డం తగదని అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. ఈ క్రమంలో దుకాణం తొలగింపు చర్యలు కొనసాగిస్తుండటంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన అరుణశాస్త్రిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
అరుణశాస్త్రి కుటుంబ సభ్యులు కనీసం దుకాణం రేకులు, ఇతర సామాగ్రిని జాగ్రత్త పరుచుకునేందుకు సమయం కోరినా అధికారులు అవకాశం ఇవ్వకుండా అక్రమంగా తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నాయకుల ఆదేశాల మేరకే అధికారులు తన ఆస్తులకు నష్టం కలిగించారని విమర్శించాడు.