
బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
తాడేపల్లి రూరల్: కుంచనపల్లి జాతీయ రహదారిపై గల బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి పైనుంచి బాలికను నీటిలోకి విసిరేసి హత్య చేసిన సంఘటనలో 24 గంటలు గడవకముందే బుధవారం తాడేపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఓ మహిళ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు మూడు గంటలు కష్టపడి బాలిక మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. వెంటన్ నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి, మంగళగిరి పట్టణ, రూరల్, పెదకాకాని సీఐ, ఎస్‌ఐలతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కుంచనపల్లి బ్రిడ్జి వద్ద, జాతీయ రహదారిపై ఉన్న కెమెరాలను పరిశీలించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాలికను గుర్తు తెలియని వ్యక్తి నడిపించుకుంటూ బ్రిడ్జి ఎక్కినట్లు నమోదైంది. మృతి చెందిన బాలిక, సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న బాలిక ఒకరే కావడంతో ఫొటోలను కృష్ణా, గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు పంపారు. వివరాలు సేకరించాలంటూ కోరారు. తాడికొండ మండలం బడేపురానికి చెందిన పాపగా గుర్తించడంతో అక్కడకు వెళ్లి వివరాలు సేకరించా రు. పేరు కూరపాటి హేమ అని, మతిస్థిమితం లేదని స్థానికులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పాపను పెంచలేక తాతయ్య ఈ పని చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలువలోకి తోసిన వ్యక్తి సరిగ్గా కనిపించకపోవడంతో పాటు లుంగీ ధరించి ఉన్నాడు. తాడేపల్లి సీఐ వీరేంద్ర హత్య చేసింది తాతయ్యా లేక ఎవరన్నా ఉన్నారనే విషయాలను లోతుగా దర్యాప్తు చేశారు. చివరికి తాత కూరపాటి మాధవరావే కాల్వలోకి తోసేశాడని పోలీసులు నిర్ధారించారు.
ప్రత్యేక దృష్టి సారించిన డీఎస్పీ
ఆరు బృందాలు దర్యాప్తు ఏర్పాటు
24 గంటల్లోపు వివరాల సేకరణ