
భూముల సమీకరణ ఉపసంహరించుకోవాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : ప్రభుత్వం రాజధాని కోసం మరో దఫా 44వేల ఎకరాలు భూమిని సమీకరిస్తున్నట్లు ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాబూరావు మాట్లాడారు. 11 సంవత్సరాల కిందట తీసుకున్న 34వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములతో కలిపి 54వేల ఎకరాలు అందుబాటులో ఉందని తెలిపారు. మరో 44 వేల ఎకరాలు తీసుకోవడం అంటే అది అమరావతి రైతుల ప్రయోజనాలకు విఘాతమని విమర్శించారు. గతంలో ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నోచుకోలేదని పేర్కొన్నారు. సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉండగా అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములు తీసుకున్నారని, అది ఇప్పటికీ కొలిక్కి రాలేదని తెలిపారు. రాజధాని కొలిక్కి రాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఇప్పుడు వేల ఎకరాల భూములు సమీకరించడం సబబు కాదని ఖండించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.న్‌భావన్నారాయణ, ఈమని అప్పారావు, కె.నళీనికాంత్, బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు