
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేపడతాం
మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు శరత్
బాపట్ల: మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మె చేపడతామని మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డికి మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలియజేశారు. నాయకులు కె.శరత్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేస్తున్న ఆందోళన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి తల్లికి వందనం పథకం వర్తింపచేయాలని, సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులందరికీ వర్తింప చేయాలని, గత ప్రభుత్వ కాలంలో చేసినటువంటి 17 రోజుల సమ్మెకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, జీవో నెంబర్ 36 ప్రకారం రూ.24,500 వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ అమలు చేయాలని కోరారు. బాపట్ల మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు హరిబాబు, అంకారావు, రత్నం, నాని, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేపడతాం