
ప్రకృతి సాగుతో గొప్ప ప్రయోజనాలు
● పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ ● ప్రకృతి సాగు పంటల పరిశీలన ● సాగు పద్ధతి ప్రయోజనాలపై అవగాహన
యడ్లపాడు:ప్రకృతి సాగు విధానంతో గొప్ప ప్రయోజ నాలు ఉన్నాయని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ.బి తెలిపారు. ప్రకృతి విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమలకుమారితో కలిసి కొత్తపాలెం గ్రామంలో మంగళవారం పర్యటించారు. రసాయనాలు లేని, సహజసిద్ధ వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులు మానం శ్రీనివాసరావు, ఐనం హరిబాబు, మానం మణింద్ర, నిక్కీ తిరుపతిరావు, దమ్ము నాగ జ్యోతి పంట పొలాలను పరిశీలించారు. వారు సాగు చేసి న బహుళ రకాల పంటలు, అంతర పంటలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మునగ తోటలో దొండ, కాకర, సొర, కనకాంబరం, అరటితోటలో తీగజాతి దోస, నిమ్మతోటలో కరివేపాకును అంతర పంటగా వేయడాన్ని గమనించారు. వినూత్న పద్ధతిలో సాగు చేసిన తీరు, ఎక్కువ దిగుబడుల్ని సాధిస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నామని తెలపడంతో రైతుల్ని ఆమె అభినందించారు.
పురుగు మందుల ఖర్చు తక్కువ..
ప్రకృతి వ్యవసాయ విధానంతో కౌలు రైతుకు మంచి దిగుబడి, రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గుతుందన్నారు. సహజ సిద్ధంగా పండించే ఉత్పత్తుల ద్వారా కౌలురైతులకు అధిక ఆదాయం వస్తుందన్నారు. అయితే వారికి కౌలుకు ఇచ్చిన భూ యజమానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సాగు విధానం చేయడం వలన నేల సారం వృద్ధి చెందుతుందన్నారు. రైతులు తమ భూముల్ని కౌలుకు ఇచ్చే సమయంలో ప్రకృతి సేద్యం చేసేవారికి మాత్రమే ఇచ్చే ఒప్పందం చేసుకుంటే మంచి దని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రకృతి సాగు సిబ్బంది సౌజన్య, అప్పలరాజు, నందకుమార్, స్వాతి, బేబీ రాణి, వెంకటేశ్వరరావు ఉన్నారు.