
దేవుని దృష్టిలో అంతా సమానమే..
రెవరెండ్ పిల్లి అంథోని దాస్
అచ్చంపేట: దేవుని దృష్టిలో అందరూ సమానమేనని నెల్లూరు మేత్రాసనం మహా ఘన రెవరెండ్ పిల్లి అంథోని దాస్ తెలిపారు. మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు పునఃప్రతిష్ట వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన జూబిలీ ఆరంభ కృతజ్ఞతార్చన సమష్టి దివ్య పూజాబలి గీతాంజలి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్మనీ నుంచి ఇక్కడకు వచ్చిన స్వామి అర్లానంద 130 సంవత్సరాల కిందట తాళ్లచెరువు గ్రామాన్ని సృష్టించడం గొప్ప విషయమని తెలిపారు. ఇక్కడ నివసించే వారందరికీ క్రైస్తవ మతాన్ని ప్రబోధించి, 1950లో బాలఏసు మందిరాన్ని నిర్మించడం అద్భుతమని పేర్కొన్నారు. దినదినాభివృద్ధి చెంది నేడు మహా దేవాలయంగా పునఃప్రతిష్ట జరుపుకోవడం ఆనందించదగిన విషయం అన్నారు. దేవాలయం నిర్మించి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గ్రామస్తుల సమష్టి కృషితో వజ్రోత్సవ జూబిలీ వేడుకలతో పాటు దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవడం అభినందనీయమని తెలిపారు. జూబిలీ వేడుకలు అంటే ఇచ్చి పుచ్చుకోవడం, పరస్పరం అభినందించుకోవడం, గౌరవభావం కలిగి ఉండటం, ప్రేమ, దయ, జాలి కలిగి ఉండి అందరూ సమానమేనని తెలుసుకోవడమని వివరించారు. కార్యక్రమంలో 50మంది ఫాదర్స్, మరో 50మంది కన్య సీ్త్రలు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన గురువులు సందేశాన్ని ఇచ్చారు. దేవాలయం విచారణ గురువులు పుట్టి అంథోనిరాజు ఆధ్వర్యంలో ప్రారంభ వేడుకలు అద్భుతంగా జరిగాయి. మూడు వేల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఉత్సవ నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు.