అవిశ్వాసపాత్రుడికి వెన్నుపోటు! | - | Sakshi
Sakshi News home page

అవిశ్వాసపాత్రుడికి వెన్నుపోటు!

May 15 2025 2:21 AM | Updated on May 15 2025 2:21 AM

అవిశ్

అవిశ్వాసపాత్రుడికి వెన్నుపోటు!

వంచనకు, వెన్నుపోటుకు మారు పేరు ఆ పార్టీ. ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు చాలామంది అదే పేరుతో సంబోధించడం తెలిసిందే! అలాంటి పార్టీని, అధినేతను నమ్మి చేరితే వెన్నుపోటు, భంగపాటు తప్ప ఏం జరుగుతుంది? ఇప్పుడు చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుకు అచ్చం అలాగే జరిగింది. వైఎస్సార్‌సీపీలో మెజార్టీ కౌన్సిలర్ల మద్దతుతో మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికై న వ్యక్తి.. అనైతికంగా సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచి పచ్చ పార్టీలో చేరి పట్టుమని 15 రోజులు ముగియకుండానే అదే వెన్నుపోటుకు బలయ్యారు. ఇప్పుడు చీరాలతోపాటు జిల్లాలో ఇదే చర్చనీయాంశంగా మారింది. జంజనంకు ఇలా జరగాల్సిందేనని పార్టీలకతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: గత నెల 30వ తేదీన పచ్చ కండువా కప్పుకొన్న చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుకు ఆ పదవిని పచ్చపార్టీ నిర్దయగా పీకేసింది. పదవిని నిలబెట్టుకునేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచి పచ్చ పార్టీ తీర్థం పుచ్చుకున్న జంజనం.. అదే తరహాలో పచ్చపార్టీ పదవి ఊడగొట్టింది. దీంతో జంజనం ఇప్పుడు రెంటికీ చెడ్డరేవడిలా మారారు. జంజనంకు వ్యతిరేకంగా సాక్షాత్తు ఆ పార్టీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌, చీరాల ఎమ్మెల్యే కొండయ్యలు చేతులెత్తి మరీ ఓటు వేయడం ఇక్కడ గమనార్హం. ఈ విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో చీరాల మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లు ఉండగా.. అత్యధికంగా 22 స్థానాలు గెలుచుకొని వైఎస్‌ఆర్‌ సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం దక్కించుకుంది. జంజనం శ్రీనివాసరావును చైర్మన్‌గా ఎన్నుకున్నారు.

కూటమి రాకతో కుట్రలు

కూటమి అధికారంలోకి రావడం, చీరాల ఎమ్మెల్యేగా పచ్చ పార్టీకి చెందిన ఎం.ఎం.కొండయ్య ఎన్నిక కావడంతో అధికారం అడ్డుపెట్టి మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు కూటమి కుట్రలకు తెరతీసింది. ప్రలోభాలకు తలొగ్గి వైఎస్సార్‌సీపీ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గాలకు చెందిన 22 మంది పచ్చ పార్టీలోకి వెళ్లారు. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావును పదవి నుంచి దించేందుకు పచ్చపార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సూచనతో అవిశ్వాసం కోసం గత నెల 23న జిల్లా కలెక్టర్‌ వెంకట మురళికి లేఖ ఇచ్చారు. దీంతో కలెక్టర్‌ మే నెల 14వ తేదీన బలనిరూపణకు గడువు పెట్టారు. పదవి నిలబెట్టుకునేందుకు చైర్మన్‌ జంజనం పచ్చపార్టీ పంచన చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే, ఇతర పెద్దలతో మంతనాలు సాగించి ఎట్టకేలకు ఏప్రిల్‌ నెల 30వ తేదీన ఎమ్మెల్యే ఎంఎం. కొండయ్య, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుల సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ మారినా ఆయనకు ప్రయోజనం లేకుండా పోయింది. ఎమ్మెల్యే, కౌన్సిలర్లు ఆయన చైర్మన్‌ పదవిలో కొనసాగేందుకు ససేమిరా అన్నారు. దీంతో బుధవారం అవిశ్వాసం పెట్టారు. అవమానభారం తట్టుకోలేక చైర్మన్‌ జంజనం అవిశ్వాస తీర్మానం మొదలయ్యే పదిహేను నిమిషాల ముందే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. సాంకేతికంగా అది కుదరలేదు. చైర్మన్‌పై అవిశ్వాసం కొనసాగింది. ఐనా ఎమ్మెల్యే, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని ఏడవలేక నవ్వినట్టు గంభీరపు సందేశం ఇచ్చారు.

వ్యతిరేకంగా ఎంపీ, ఎమ్మెల్యేలు

జంజనం శ్రీనివాసరావు గత నెల 30న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం జరిగిన అవిశ్వాసంలో సాక్షాత్తూ ఆ పార్టీ బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యలు జంజనంకు వ్యతిరేకంగా చేతులెత్తి మరీ ఓట్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సన్నివేశం చూసిన చీరాల వాసులు నవ్విపోతున్నారు. పదవి ఇచ్చి గౌరవించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన జంజనంకు అదే పరిస్థితి వచ్చిందని, పార్టీలో చేర్చుకొని పచ్చపార్టీ తగిన బుద్ధి చెప్పిందని వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

లోకేష్‌ చెప్పడంతోనే..

చీరాల: మంత్రి లోకేష్‌ చెప్పడంతోనే తాను మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశానని, రానున్న రోజుల్లో టీడీపీతో తన పయనం ఉంటుందని జంజనం శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు.

చీరాల మున్సిపల్‌ చైర్మన్‌పై పచ్చ పార్టీ అవిశ్వాసం రాజకీయంగా పదవి ఇచ్చిన వైఎస్సార్‌సీపీకి ద్రోహం పదవి కోసం అనైతికంగా టీడీపీలో చేరిన జంజనం అవిశ్వాసానికే మొగ్గిన ఎమ్మెల్యే, పచ్చ పార్టీ కౌన్సిలర్లు పార్టీ మారినా చైర్మన్‌ పదవి ఇచ్చేది లేదన్న కౌన్సిలర్లు పదవి కోసం రేసులో ముగ్గురు కౌన్సిలర్లు.. ఎటూ తేలని పంచాయితీ రెంటికీ చెడ్డ రేవడిలా జంజనం పరిస్థితి

పచ్చ పార్టీలో మొదలైన లొల్లి

మున్సిపల్‌ చైర్మన్‌ అవిశ్వాసం వ్యవహారం చీరాల పచ్చ పార్టీలోనూ అసంతృప్తులు రాజేసింది. కౌన్సిలర్లు అవిశ్వాసం కోసం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వగానే పచ్చ పార్టీ చీరాల పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెరపైకి వచ్చారు. మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాసం అవసరం లేదని ప్రకటించడంతో ఆ పార్టీలోని లుకలుకలు రోడ్డునపడ్డాయి. మరోవైపు చైర్మన్‌ పదవి కోసం కౌన్సిలర్లు యాదవ సామాజికవర్గానికి చెందిన సాంబశివరావు, గౌడ వర్గానికి చెందిన ఎస్‌.లక్ష్మి, వైశ్య వర్గానికి చెందిన సుబ్బయ్యలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే మద్దతు కోసం కొందరు, ఆయన తనయుడి ఆశీర్వాదం కోసం ఇంకొందరు పోటీలు పడుతున్నారు. ఇప్పుడు అవిశ్వాసం కూడా ముగియడంతో చైర్మన్‌ గొడవ ఊపందుకోనుంది. మున్సిపాలిటీని వారం రోజులపాటు ప్రత్యేక అధికారి పాలనలో ఉంచి చైర్మన్‌ ఎన్నికకు వెళ్లాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైర్మన్‌ పదవి కోసం ఒక్కో కౌన్సిలర్‌ సుమారు రూ. 7 లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ లెక్కన రూ. కోట్లలోనే ఆశావహులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత మొత్తం వెచ్చించినా చైర్మన్‌ పదవి ఇంకా కేవలం 8 నెలలే ఉండడంతో కొందరు ఆలోచనలో పడుతున్నట్లు సమాచారం. పదవి ఎవరికి ఇచ్చినా మిగిలిన ఆశావహులు అలకబూనే పరిస్థితి కనపడుతోంది. ఇదే అవకాశంగా మాజీ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు సైతం తన వర్గాన్ని ఎగదోసే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అవిశ్వాసం వ్యవహారం చీరాల పచ్చపార్టీలో మరింతగా అగ్గి రాజేసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.

అవిశ్వాసపాత్రుడికి వెన్నుపోటు! 1
1/1

అవిశ్వాసపాత్రుడికి వెన్నుపోటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement