
20 సూత్రాల అమలుకు చిత్తశుద్ధితో పని చేయాలి
లంకా దినకర్‌బాబు
బాపట్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాబు అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, డ్వామా, డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్, గృహ నిర్మాణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, విద్యుత్, పబ్లిక్ హెల్త్, మెప్మా, పర్యాటక శాఖలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంతో అధికారులంతా సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా జీడీపీ 11.2 శాతం ఉండగా, రానున్న ఏడాదిలో 15 శాతానికి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. అభివృద్ధి వైపు బాపట్ల జిల్లా అడుగులు వేయాలంటే క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చాలా ముఖ్యమన్నారు. నీతి ఆయోగ్ సూచనలను పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా పని చేయాల్సి ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీరణం పెరిగితే, రసాయనాల వినియోగం పూర్తిగా అరికట్టవచ్చన్నారు. సూర్యలంక, రామాపురం, మోటుపల్లి బీచ్‌లు అభివృద్ధి చెందితే స్వర్ణాంధ్రప్రదేశ్‌లో బాపట్ల జిల్లాను భాగస్వామ్యం చేయవచ్చన్నారు. పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. కేంద్ర ప్రాయో జిత స్వదేశీ దర్శన్ పథకం క్రింద సూర్యలంక బీచ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.97.52 కోట్లు మంజూరయ్యాయన్నారు. సూర్యలంక, రామాపురం బీచ్‌ల ‘బ్లూ ఫ్లాగ్’ స్టేటస్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పీఎం ఫసల్ బీమా పథకంపై అవగాహన కల్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. కలెక్టర్ జె.వెంకట మురళి, డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, సీపీఓ కె శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.