
నేడు ప్రైవేటు పాఠశాలలు మూత
రాజంపేట రూరల్: ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యంపై ఫీల్డ్ అధికారులు పంపిస్తున్న సందేశాలు, హెచ్చరికలు వంటి చర్యలకు ప్రతిస్పందనగా గురువారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలను మూసివేయనున్నట్లు అపుస్మా జిల్లా కార్యదర్శి రాఘవరెడ్డి వేంకటేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల పై ఫీల్డ్ అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వహణకు ఏదైనా అంతరాయం ఏర్పడితే అది 10 వేల మంది యాజమాన్యాలను ప్రభావితం చేస్తుందన్నారు. అదే విధంగా 3లక్షల మంది సిబ్బందిని, 40 లక్షల మంది విద్యార్థులను కూడా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే వారే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు.
తాళ్లపాక చెన్నకేశవస్వామికి గరుడ వాహనం
రాజంపేట: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామికి సర్పంచ్ శ్యామనబోయిన గౌరీశంకర్, నాగమణి దంపతులు గరుడ వాహనంను అందచేశారు. బుధవారం అన్నమయ్య ధ్యానమందిరం ఆవరణలో ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీకి గరుడ వాహనం తయారుచేయించి అప్పగించారు. ఈ సందర్భంగా తాళ్లపాక సర్పంచ్ మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవస్వామిని తాళ్లపాక అన్నమాచార్యులు పూజించి, ఆరాధించారన్నా రు. అటువంటి స్వామికి తాము గరుడ వాహనం చేయించి ఇవ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, టీటీడీ సిబ్బంది, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
బయోగ్యాస్ ప్లాంట్
ఏర్పాటుకు స్థల పరిశీలన
గాలివీడు: కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కోసం ఆర్డీఓ శ్రీనివాసులు స్థలాన్ని పరిశీలించారు. బుధవారం మండలంలోని తూముకుంట గ్రామంలో తహసీల్దార్ భాగ్యలతతో కలసి అనువైన స్థలం కోసం ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిలయన్స్ సంస్థ సహకారంతో 100 ఎకరాల్లో బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటులో భాగంగా స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. సేంద్రియ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ వంటి వ్యర్థాలతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ భవానీ శంకర్, మండల సర్వేయర్ మురళీ, హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళారులను నమ్మి విత్తనాలు కొనుగోలు చేయవద్దు
ఒంటిమిట్ట: వరి సాగు చేసేందుకు దళారులను నమ్మి వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయరాదని, అలా చేస్తే ప్రభుత్వం రైతులకు జవాబుదారితనంగా ఉండదని కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్ర నాయక్ తెలియజేశారు. బుధవారం మండలంలోని చెర్లోపల్లి, నడింపల్లి గ్రామ పొలాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వరినాటు వేసే ప్రతి రైతు నారు కొనలు తుంచి నాటాలని, దీనివలన కాండం తొలుచు పురుగు ఉధృతిని తగ్గించవచ్చని, అలాగే పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము వేసి దుక్కిలో కలియదున్నడం వలన మొక్కలకు పోషకాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, వీఏఏ చంద్రమోహన్, వీహెచ్‌ఏ ప్రియదర్శిని, ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

నేడు ప్రైవేటు పాఠశాలలు మూత

నేడు ప్రైవేటు పాఠశాలలు మూత