
దళిత యువకునిపై అమానుష దాడి
కలికిరి(వాల్మీకిపురం) : దళిత యువకునిపై జరిగిన అమానుష దాడి ఘటన వాల్మీకిపురం మండల పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు... మండలంలోని చింతపర్తి గ్రామం కోటపల్లికి చెందిన గురునాథ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే గ్రామం బోయపల్లి నుంచి కూలీలను తన ఆటోలో పని చేసే ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. ఆటో డ్రైవర్ గురునాథ తన భార్యకు ఫోన్ చేశాడన్న అనుమానంతో బోయపల్లికి చెందిన భార్గవ ఈ నెల 27న గురునాథను బోయపల్లి సమీపంలోని ఓ తోటలోకి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అమానుషంగా దాడి చేసి గాయపరిచాడు. దాడిలో గురునాథ చేయి విరిగింది. చెవికి రక్త గాయాలయ్యాయి. దాడి ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో హల్‌చల్ చేస్తోంది.
తనపై దాడికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మూడు రోజుల క్రితం బాధితుడు గురునాథ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కనీసం దాడి ఘటనపై విచారించకుండా కాలయాపన చేస్తుండటంతో మాలమహానాడు నేతలతో కలిసి మంగళవారం వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలపారు. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెల మోహన్ మాట్లాడుతూ ఓ దళితునిపై దాడి జరిగితే పోలీసులు రాజకీయ ఒత్తిడితో కేసు నమోదు చేయక పోవడం దుర్మార్గమన్నారు. దళిత యువకునిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోక పోతే మాలమహానాడు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహానాడు నేతలు గుండా మనోహర్, శివయ్య, వెంకటస్వామి, సుధా, నాగార్జున, ప్రశాంత్, బాధితుని తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

దళిత యువకునిపై అమానుష దాడి