● అతిపెద్ద రిజర్వాయర్‌ ఆవులపల్లె | - | Sakshi
Sakshi News home page

● అతిపెద్ద రిజర్వాయర్‌ ఆవులపల్లె

May 17 2025 5:58 PM | Updated on May 17 2025 5:58 PM

● అతి

● అతిపెద్ద రిజర్వాయర్‌ ఆవులపల్లె

మదనపల్లె: కరువు రైతులకు సాగునీటి కష్టాలు తీర్చి, ప్రజలకు తాగునీటి ఇబ్బందులను దూరం చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కృషితో మంజూరైన ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్లపై టీడీపీ ఆదినుంచి కక్ష కట్టింది. ప్రజలు, రైతులకు మంచి జరిగితే భరించలేకపోతోంది. ప్రాజెక్టులతో అభివృద్ధికి కృషి చేయడమే నేరంగా చూస్తోంది. హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించి కరువునేలను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యాన్ని ప్రతిపక్షంలో ఉండగా అడుగడుగునా అడ్డంకులతో ఎన్జీటీ కేసుతో అడ్డుకున్న టీడీపీ..ఇప్పుడు ఆధికారంలోకి రాగానే విజిలెన్స్‌ విచారణతో రిజర్వాయర్లను మట్టిలో కలిపేసే కుట్రలు చేస్తోంది. చేసిన పనులకు రూ.800 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో ఇప్పుడు ఈ బిల్లులను అడ్డుకునే కుట్రలో భాగంగా విజిలెన్స్‌ విచారణ పేరుతో కొత్త నాటకానికి తెరతీసింది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని, రికార్డులను పరిశీల చేపట్టింది. హంద్రీ–నీవా ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్‌ ఆవులపల్లె కావడం, ఈ మూడింటి పనులు పూర్తయితే ఉమ్మడిజిల్లాలో పెద్దాయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న అక్కసు, భవిష్యత్‌లో టీడీపీ మనుగడ కష్టమని భావించి పనులు పూర్తిగా ఆపివేసే కుట్రలకు సిద్దమైంది.

రూ.800 కోట్లు పెండింగ్‌: ఈ మూడు రిజర్వాయర్లకు సంబంధించి పనులు నిలిపివేసిన 2023 మే 11 నాటికి ముదివేడు రిజర్వాయర్‌ 33శాతం, నేతికుంటపల్లె 86శాతం, ఆవులపల్లె 5.8 శాతం పనులు జరిగాయి. మొత్తం టెండర్‌ వ్యయంలో జరిగిన పని విలువ రూ.800 కోట్లకుపైనే. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చెల్లించింది రూ.30 కోట్లని సమాచారం. ప్రస్తుత ప్రభుత్వంలో పైసా బిల్లు ఇవ్వలేదు. పైగా చేసిన పనులకు రూ.800 కోట్ల వరకు ప్రభుత్వం బిల్లులను చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారం ముందు వస్తుందని, దీనిని అడ్డుకోవడం, మరోవైపు రిజర్వాయర్లకు శాశ్వత సమాధి కట్టడం కోసం కూటమి ప్రభుత్వం పెద్దాయనపై కక్షతో కరువు రైతులను శిక్షిస్తోంది. చేసిన బిల్లుల చెల్లింపుపై ఊసేత్తని ప్రభుత్వం రంధ్రాన్వేషణ చేసి కక్షసాధింపులకు పాల్పడుతోంది.

టెండర్‌లో రూ.64 కోట్ల ఆదా

మూడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.2,144.50 కోట్లు మంజూరు చేయగా టెండర్ల నుంచి ఒప్పందం వరకు అన్ని పారదర్శకంగానే జరిగాయి. ఇందులో నిర్మాణాలకు రూ.1,529.37 కోట్లు, భూసేకరణ,ఇతర పనులకు రూ.615.13కోట్లు కేటాయించారు. మూడు రిజర్వాయర్లను ఒకేపనిగా రూ.1,554,21,60,649 అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లలో ఎన్‌ఈసీఎల్‌, ఆర్‌ఆర్‌సీఐఐపిఎల్‌ జాయింట్‌ వెంచర్‌, మేఘా ఇంజనీరింగ్‌ వర్క్‌, హెఈఎస్‌ ఇన్‌ఫ్రా ప్రై యివేట్‌ లిమిటెడ్‌ సంస్థలు పాల్గొన్నాయి. అంచనా కంటే అధికంగా రూ.1,618.72 కోట్లకు టెండర్లు వేయగా, దీనిపై ప్రభుత్వం రివర్స్‌ టెండర్‌ నిర్వహించగా జాయింట్‌ వెంచర్‌ సంస్థ రూ.1,553.96 కోట్లతో టెండర్‌ వేయడంతోప్రభుత్వానికి రూ.64.76 కోట్ల ఆదా అయ్యింది. అంటే టెండర్‌ నిర్వహణ పారదర్శకంగానే జరిగింది. ఇందులో పొరబాట్లకు చోటులేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వందకోట్లు దాటిన పనులకు జ్యుడిషియల్‌ రివ్యూ అనుమతులు వచ్చాకే కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరిగింది.

అప్పుడు ఎన్జీటీతో..ఇప్పుడు విజిలెన్స్‌తో

మూడు రిజర్వాయర్ల నిర్మాణ పనులు మొదలయ్యాక టీడీపీ నేతలు అడ్డంకులు సృష్టించడం మొదలైంది. ఎన్జీటీలో కేసువేసి పనులు నిలిపివేయించారు. 2023 ఆగస్టు 4న ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగళ్లుకు వచ్చిన చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించిన వారిపై టీడీపీ శ్రే ణులు దాడులు చేశాయి. ఇప్పుడు అధికారంలోకి రావడంతో విజిలెన్స్‌ విచారణ పేరుతో రిజర్వాయర్లకు సమాధి కట్టి కరువు రైతాంగానికి ప్రాజెక్టుల ఫలాలు అందడకుండా చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. శుక్రవారం మదనపల్లె, తంబళ్లపల్లెల్లో పర్యటించిన జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రిజర్వాయర్లను ఉద్దేశించి చేసిన ఆరోపణలు చూస్తుంటే..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెద్దాయన చేపట్టిన అభివృద్ధిపై ఎంతటి కక్ష సాధింపులకు పాల్పడుతోందో స్పష్టం అవుతోంది.

రూ.2,144 కోట్లతో ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్లు చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

హంద్రీ–నీవా ప్రాజెక్టులోనే ఆవులపల్లె అతిపెద్ద రిజర్వాయర్‌

టీడీపీకి మనుగడ ఉండదన్న కక్షతో పార్టీ నేతలతో ఎన్జీటీలో కేసు

అర్ధంతరంగా ఆగిపోయిన పనులు

రూ.800 కోట్లు పనులకు బిల్లులు ఇవ్వలేదు

పనులు ఆపే ఉద్దేశంతో విజిలెన్స్‌ విచారణ పేరుతో కొత్త నాటకం

ఆసియా ఖండంలో అతిపెద్ద, 31 ఎత్తిపోతలు కలిగిన ప్రాజెక్టు హాంద్రీ–నీవా. ఈ ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్‌ చిత్తూరుజిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆవులపల్లె, 3.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌ కింద 20వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఇంత గొప్ప రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టలేని టీడీపీ..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టడం జీర్ణించుకోలేకపోతోంది. ఇదేకాక కరువుకు కేరాఫ్‌ అయిన అన్నమయ్యజిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో 120 చెరువులకు నీటిని అందించి 15వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి కొత్తగా 20వేల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంతో రెండు టీఎంసీల సామర్థ్యంతో ముదివేడు రిజర్వాయర్‌ పనలు చేపట్టారు. చిత్తూరుజిల్లా పుంగనూరు మండలంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో నేతికుంటపల్లె రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టి దీనికింద 5వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా 10వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యం. ఈ పనులు పూర్తయితే వీటిని నిర్మాణం కోసం కృషి చేసిన పెద్దాయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. తద్వారా కరువు రైతుల జీవితాల్లో మార్పు వచ్చి ఆర్థికంగా స్థితిమంతులవుతారు. దీంతో వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరగడం తథ్యం. ఇదే జరిగితే ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ కుట్రలకు తెరతీసింది.

● అతిపెద్ద రిజర్వాయర్‌ ఆవులపల్లె 1
1/1

● అతిపెద్ద రిజర్వాయర్‌ ఆవులపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement