ఉన్నత విద్యలో ‘షేరింగ్‌’

UGC Asks Universities To Share Resources With Students of Other HEI - Sakshi

విద్యా సంస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే విధానానికి శ్రీకారం

నాలెడ్జ్‌ షేరింగ్, నాలెడ్జ్‌ ట్రాన్స్‌ఫర్‌కి వీలుగా నిర్ణయం

యూజీ, పీజీ, పరిశోధన కోర్సుల్లో అమలు

సాక్షి, అమరావతి: సెంట్రల్‌ వర్సిటీలు సహా దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లోని వనరులను సద్వినియోగం చేయడం, సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలు కూడా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ‘షేరింగ్‌’ విధానానికి శ్రీకారం చుట్టింది. వివిధ సదుపాయాలతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన ఇతర అంశాల్లో విద్యా సంస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తెరతీసింది. నాలెడ్జ్‌ షేరింగ్, నాలెడ్జ్‌ ట్రా­న్స్‌ఫర్‌కి వీలుగా టెక్నాలజీని, ఇతర వనరులను ఆయా సంస్థలు ఉమ్మడిగా వినియోగించుకునేందు­కు ఈ విధానం దోహదపడనుంది.  

సెంట్రల్‌ వర్సి­టీలు సహా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలిచ్చింది. అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌–గ్రా­డ్యుయేట్‌ కోర్సులతో పాటు పరిశోధన కోర్సు­ల్లోనూ దీన్ని అమలుచేయాలని సూచించింది. వన­రులు లేని విద్యాసంస్థలు వాటిని ఏర్పా­టు చేసు­కునేందుకు అదనపు పెట్టుబడి పెట్టా­ల్సిన అవసరంలేకుండా దగ్గర్లోని విద్యా సంస్థల వన­రు­లను వినియోగిస్తూ తమ విద్యార్థులను ఆయా సంస్థలు తీర్చిదిద్దడానికి ఈ విధానంతో వీలుపడుతుంది. 

రెట్టింపు ఫలితాలు
ఈ విధానంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయని యూజీసీ భావిస్తోంది. అకడమిక్‌ అంశాలు సహా ఏదైనా అభివృద్ధి కార్యకలాపాలను సమగ్రంగా అమ­లు­చేయాలంటే అదనపు సదుపాయాలు అవ­సరమవుతుంటాయి. ఇందుకోసం ఆయా సంస్థలు అదనపు పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా.. ఇ­ప్పటికే ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యా­సంస్థలు పరస్పర సహకారంతో విద్యాప­ర­మైన మౌలిక వనరులను పంచుకోవడం వల్ల వి­ద్యార్థులకు సమానమైన విద్య అందుతుంది.

ప్రస్తు­తం ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర వనరులున్న సంస్థ­ల్లో చదివే వారికి ఆ వనరుల ద్వారా ఉత్తమ బోధన లభిస్తుంది. కానీ, అలాంటివిలేని సంస్థల విద్యా­ర్థులకు ఉన్నత బోధన దూరమవుతోంది. వనరు­లను పంచుకునేలా ఆయా సంస్థల మధ్య జరిగే­ఒప్పందాలతో విద్యార్థులందరికీ మేలు చేకూరు­తుంది. అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌–గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ కోర్సులన్నిటికీ ఈ విధానాన్ని అమలుచేయాలని యూజీసీ సూచించింది.

ఆయా విద్యాసంస్థలన్నీ తమ సంస్థలోని తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర వనరుల సమాచారాన్ని సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ తెలిసేలా వెబ్‌సైట్‌  ద్వారా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వీటిని వినియోగించుకో­వాల­నుకునే ఇతర ఉన్నత విద్యా సంస్థల నుంచి నిర్దిష్ట వనరులకు సాధారణ కనీస ఛార్జీలు నిర్ణయించి వసూలుచేయవచ్చని సూచించింది. ఆ కనీస ఛార్జీల వివరాలూ అందుబాటులో ఉంచాలని పేర్కొంది. 

సంస్థల మధ్య ఒప్పందాలు
ఇక ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను పరస్పర భాగస్వామ్యంతో వినియోగించుకునేందుకు వీలు­గా ఆయా సంస్థలు ఎంఓయూ కుదుర్చు­కోవా­లని యూజీసీ పేర్కొంది. ఏ సమయంలో ఏ సంస్థ వి­ద్యార్థులు వనరులు వినియోగించుకోవాలో సమగ్ర టైమ్‌టేబుల్‌ను రూపొందించి ఆ ప్రకారం కార్య­క్రమాలకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వన­రులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సంస్థలు చర్యలు చేపట్టాలని, ఏ ఒక్క తరగతి ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని యూజీసీ సూచించింది. 

ఈ విధానంతో విద్యార్థులకు మేలు..
తరగతి గదులు, మౌలిక సదుపాయాలు  పంచుకో­వడం ద్వారా విద్యార్థులకు మేలు చేకూ­రుతుంది. క్రీడా మైదానాలు, స్టేడియం, సమావేశ మందిరాలను కూడా అవసరాలను అనుసరించి పంచుకోవచ్చు. సైన్సేతర అంశాలకు సంబంధించిన వనరుల విషయంలో కూడా సంస్థలు పూర్తిస్థాయి­లో తమ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను ఇతర సంస్థలకు అందుబాటులో ఉంచాలని యూజీసీ పేర్కొంది. పరికరాలు దెబ్బతినే విషయంలోనూ వాటిని తిరిగి ఏర్పాటుచేయడంపైనా ఒప్పందంలో పేర్కొనాలి. అకడమిక్‌ అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ లెక్చర్‌లు, వీడియోలు, లెర్నింగ్‌ మెటీరి­యల్‌లు, లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ లలోనూ ఇచ్చిపుచ్చుకోవచ్చు. విద్యార్థుల నమోదు ప్రక్రియ మొత్తం ముందుగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా పూర్తిచేయాలి. ఉపాధ్యాయుల శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు.

ఖర్చులపై ముందుగానే ప్రణాళిక
వనరులను పంచుకోవడానికి ముందు వ్యయ విశ్లేషణ, ఖర్చును నిర్ణయించే పద్ధతులపై ప్రణాళిక రూపొందించుకోవాలి. లాభనష్టాలకు తావులేని రీతిలో వనరుల వినియోగంపై ఛార్జీలు వసూలు­చేయాలి. ప్రయోగాల వినియోగం ఆధారంగా, నిర్వహణ వ్యయం ప్రకారం పరికరాలు ఛార్జీలు నిర్ణ­యించాలి. ఉన్నత విద్యాసంస్థల మధ్యే కాకుండా కాలేజీలు, పరిశ్రమల మధ్య కూడా ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top