కళ్లెదుటే మార్పు

Three Years For Village And Ward Secretariat system Andhra Pradesh - Sakshi

అభివృద్ధితో ఊరు మారింది.. రాష్ట్రమూ మారింది

సచివాలయ వ్యవస్థకు మూడేళ్లు.. పాలనలో స్పష్టమైన మార్పు 

ఒకేసారి 4 లక్షల కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు

అవినీతి, పక్షపాతం, పైరవీలకు తావులేకుండా సంక్షేమ పథకాల అమలు

ఈ వ్యవస్థకు అనుబంధంగా విలేజ్‌ క్లినిక్‌లు, ఆర్బీకేలు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు

ఒకప్పుడు ఐదారు గ్రామాలకు ఒకే పంచాయతీ కార్యదర్శి

ఇప్పుడు ఒక్కో గ్రామంలో పది మంది ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు

ఇంటర్‌నెట్‌కు నోచుకోని వేలాది గ్రామాల్లో ఇప్పుడన్నీ డిజిటల్‌ సేవలు

డిజిటల్‌ లైబ్రరీల ద్వారా ఉన్న ఊరి నుంచే వర్క్‌ ఫ్రమ్‌ హోం

గ్రామాల్లో ప్రభుత్వ ఆఫీసుల కోసం కొత్తగా 37 వేల భవన నిర్మాణాలు

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలోని కుగ్రామాల్లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏకంగా 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, 2.65 లక్షల మంది వలంటీర్లు ఈ వ్యవస్థలో భాగస్వాములై ప్రజల గడప వద్దకే సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మూడేళ్లు పూర్తి చేసుకున్న ఈ వ్యవస్థకు అనుసంధానంగా ఏర్పాటైన విలేజ్‌ క్లినిక్‌లు ప్రజారోగ్య సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

ఇదివరకెన్నడూ లేని విధంగా ఏర్పడ్డ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) విత్తనం మొదలు పంట విక్రయం వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ఇదే సమయంలో నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్ల స్వరూపమే మారిపోయింది. గ్రామ గ్రామాన ఇంగ్లిష్‌ మీడియం చదువులు పేదల ఇళ్లలో విద్యా వెలుగును నింపుతున్నాయి. డిజిటల్‌ లైబ్రరీలతో యావత్‌ ప్రపంచం కుగ్రామాలకు మరింత చేరువైంది.

తద్వారా ఎంతో మంది యువతీ యువకులు వర్క్‌ ఫ్రమ్‌ హోం ద్వారా సొంత గ్రామం నుంచే పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. నభూతో అన్న రీతిలో ఏకంగా 37,181 శాశ్వత భవనాల నిర్మాణం ద్వారా ఆస్తుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

కేవలం మూడంటే మూడేళ్లలోనే మన కళ్లెదుటే ఇలా ఎన్నో అనూహ్య మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రజలకు సేవలందించే విషయంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఏపీ దరిదాపుల్లో లేదనడం అతిశయోక్తి కాదు. ఏకంగా 4.70 కోట్ల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఎంతగా లబ్ధి కలిగించిందనేది అంచనాలకు అందనిది.

ఎంతలో ఎంత తేడా!

► అవ్వాతాతలు పింఛను కోసం ఒకప్పటిలా.. గవర్నమెంట్‌ ఆఫీసుల చుట్టూ, ఆ ఊళ్లో పెద్దలు.. అధికార పార్టీ రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు.

► ఒకేసారి రూ.15 – 20 వేలు ప్రభుత్వ లబ్ధి కలిగేటప్పుడు కూడా లక్షల సంఖ్యలో ఉండే లబ్ధిదారుల్లో ఏ ఒక్కరినీ ఎవరూ కూడా ఒక్క రూపాయి లంచం అడిగే పరిస్థితి అసలే లేదు. 

► పింఛనే కాదు మరే ప్రభుత్వ సంక్షేమ పథకం కోసమైనా పేదలెవరూ పైరవీ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. 

► నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు ఆపసోపాలు పడుతూ ప్రతి నెలా తమ పింఛను డబ్బులు తీసుకోవడానికి ఊళ్లో పంచాయతీ ఆఫీసు దాకా కూడా వెళ్లాల్సిన అవసరమే లేదు. 

► ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలాంటి చిన్నా.. పెద్దా పని పడినా మారుమూల కుగ్రామాల్లో ఉండే ప్రజలు ఊరు దాటి మండలానికో, పట్టణా నికో వెళ్లాల్సిన పని అంతకంటే లేదు. 

► సీఎం వైఎస్‌ జగన్‌ మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇలాంటి అనేక స్పష్టమైన మార్పులను తీసుకొచ్చింది.

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే విప్లవాత్మక రీతిలో శ్రీకారం చుట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వ్యవస్థ ద్వారా కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం నాలుగు నెలల్లోనే అత్యంత పారదర్శకంగా వాటిని భర్తీ చేశారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇప్పుడు ప్రొబేషనరీని కూడా పూర్తి చేసుకొని.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పే– స్కేళ్లతో కూడిన వేతనాలు అందుకుంటున్నారు.

ప్రజల గడప వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లందుకు.. సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 70–100 ఇళ్లకు ఒకరి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి వారికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కూడా అందజేస్తున్నారు. మొత్తంగా.. ఒక్క సచివాలయ వ్యవస్థ ఏర్పాటు నిర్ణయం ద్వారానే ప్రభుత్వం నాలుగు లక్షల కుటుంబాలకు ఉద్యోగావకాశాలను కల్పించింది. 

11,354 ప్రభుత్వ భవనాల నిర్మాణం 
► సచివాలయ వ్యవస్థ.. కేవలం ఉద్యోగుల నియామకం, ప్రజలకు సేవలు అందించడానికే పరిమితం కాలేదు. ప్రతి గ్రామంలో ఇలాంటి సేవలు అందజేసేందుకు శాశ్వత గ్రామ సచివాలయాల భవనాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ భవనాలు, డిజిటల్‌ లైబ్రరీ భవనాలు  మొత్తం  37,181 నిర్మాణం కూడా చేపట్టింది.
► అందులో 11,354 భవన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తవగా, మిగిలిన వాటిలో చాలా వరకు శ్లాబ్‌ దశలో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి గ్రామ సచివాలయ, రైతు భరోసా, హెల్త్‌ క్లినిక్‌ భవనాలు పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక బద్ధంగా పని చేస్తున్నారు. 
► ఈ వ్యవస్థకు అనుబంధంగా ఏర్పాటైన విలేజ్‌ క్లినిక్‌లు, ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు.. ప్రజలు, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్నాయి. ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు పేదల స్థితిగతులను సమూలంగా మార్చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి.

కుగ్రామాల్లోనూ ప్రతి రోజూ ‘స్పందన’ 
► గ్రామాల్లో బడి కాకుండా ఉండే ప్రభుత్వ ఆఫీసు ఒక్క పంచాయతీ కార్యాలయమే. సగానికి పైగా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు ఏడాదికి ఓ 12 నుంచి 15సార్లు మించి తెరుచుకోని పరిస్థితి ఉండేది. మూడేళ్ల క్రితం వరకు అసలు గ్రామ పంచాయతీ కార్యదర్శి సైతం లేని గ్రామాలు ఎన్నో ఉండేవి. ఉన్నా.. నాలుగైదు గ్రామాలకు ఒకరు ఇన్‌చార్జిగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఒక్కో గ్రామంలో పదేసి మంది పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు.

► రైతులకు వ్యవసాయ సలహాలిచ్చేందుకు ప్రతి చోట ఓ వ్యవసాయ అసిస్టెంట్‌ పని చేస్తున్నారు. అనారోగ్యం పాలైన పశువులకు వైద్యం చేసేందుకు మరో ఉద్యోగిని నియమించారు. కరెంట్‌ అంతరాయాలను వెంటనే సరిచేయడానికి ప్రతి గ్రామానికీ ఓ ఎనర్జీ అసిస్టెంట్‌ను కూడా ప్రభుత్వం నియమించింది. ఏ ఊరికి ఆ ఊరిలో అక్కడి ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఆ గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ  ప్రతి రోజూ సాయంత్రం 3–5 గంటల మధ్య ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.

ఇంటర్‌నెట్‌ లేని గ్రామాలు 110 లోపే..
► మూడేళ్లకు ముందు రాష్ట్రంలో మూడొంతుల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీసం కంప్యూటర్లు కూడా లేవు. కంప్యూటరు ఉన్న చాలా గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో ఇంటర్‌నెట్‌ వసతి లేక అవి పూర్తిగా నిరుపయోగంగా ఉండేవి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సమయంలో ప్రభుత్వం ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి కొత్తగా రెండేసి కంప్యూటర్లు, కరెంటు లేని సమయంలో అది పనిచేయడానికి ఓ యూపీఎస్, ఇతరత్రా ఫర్నిచర్‌ను అందజేసింది.

► ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికకు ప్రతి ఒక్కరి బయోమెట్రిక్‌ నమోదుకు ఫింగర్‌ ప్రింట్, ఐరిష్‌ స్కానర్లను కూడా అందజేశారు. సచివాలయంలోనే లబ్ధిదారులకు పింఛను కార్డు, ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసేందుకు ప్రతి సచివాలయానికి ప్రింటర్, లామినేషన్‌ మిషన్‌లను సరఫరా చేశారు.

► సచివాలయంలో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్‌ ఎప్పటికప్పుడు ఆ సచివాలయానికి అందే దరఖాస్తులు ఆయా శాఖల వెబ్‌సైట్లలో నమోదు చేయడానికి ప్రతి సచివాలయానికి ఇంటర్‌ నెట్‌ వసతిని కూడా కల్పించారు. రాష్ట్రంలో కుగ్రామంలో ఉండే సచివాలయంలో కూడా ఇప్పుడు డిజిటల్‌ సేవలే కొనసాగుతున్నాయి. 

► రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలు ఉండగా, కొండ ప్రాంతాల్లో ఉండే కేవలం 110 సచివాలయాల్లో మాత్రమే ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేదని, ఆయా సచివాలయాల్లో మొదట మాన్యువల్‌గా ఆ సేవలు అందజేస్తున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు చెప్పారు.

సచివాలయాల ద్వారానే ఐదు కోట్ల ప్రభుత్వ సేవలు
► నగరాల్లో ఉండే వార్డు సచివాలయాలు, కుగ్రామంలో ఉండే సచివాలయం అన్న తేడా లేకుండా 2020 జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 

► కొన్ని ఎంపిక చేసిన సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా మొదలయ్యాయి. దశల వారీగా అన్ని సచివాలయాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తర్వాత దశలో పాస్‌పోర్టు, ఆధార్‌ సేవలు వంటి దాదాపు 200కు పైగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, కార్పొరేట్‌ సంస్థల సేవలను కూడా సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. 

► ఇప్పటి దాకా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 4.70 కోట్ల వినతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో 10.50 లక్షల మంది ఆధార్‌ సేవలను కూడా వినియోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ బీమాకు సంబంధించి 8.93 లక్షల మంది అసంఘటిత కార్మికులకు సచివాలయాల ద్వారానే ఈ– శ్రమ్‌ కార్డులను అందజేశారు.

యూనిసెఫ్‌ గుర్తింపు
► ప్రపంచ వ్యాప్తంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే యూనిసెఫ్‌ సంస్థ సైతం మన రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ పట్ల ప్రశంసలు తెలిపింది. రాష్ట్రంలో ఆ సంస్థ అందజేసే సేవల్లో గ్రామ, వార్డు సచివాలయాలను, వలంటీర్లను భాగస్వామ్యం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా యూనిసెఫ్‌కు చెందిన యూఎన్‌ వలంటీర్ల విభాగం ప్రతినిధుల బృందం కూడా పని చేస్తుండటం విశేషం.   

►  దీనికి తోడు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు జాతీయ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన ఉన్నతాధికారుల బృందాలు వేర్వేరుగా మన  రాష్ట్రంలో పర్యటించి.. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి వెళ్లాయి. 

► పంజాబ్, రాజస్థాన్‌ రాష్ట్రాలు వలంటీర్ల వ్యవస్థ స్థితిగతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సమాచారం కావాలని తెలుసుకొని, వాటిని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసే విషయమై అధ్యయనం చేస్తున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top