
సాక్షి,అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో కారు - బైక్ రేసింగ్ వివాదంగా మారింది. అటవీ ప్రాంతంలో రేసింగ్ చేసుకునేందుకు నిర్వాహకులకు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుమతి ఇచ్చారు. పర్యాటక అభివృద్ధి కోసమే రేసింగ్‌కు అనుమతి ఇచ్చామని అన్నారు. అయితే, కారు-బైక్ రేసింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
శింగనమల, నార్పల, పుట్లూరు మండలాల్లో జరుగుతున్న రేసింగ్ నిర్వహణను బెంగళూరుకు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తుంది. సదరు సంస్థ నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని రేసింగ్‌కు అనుమతి ఇచ్చారంటూ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామ శివారులో బైకు, కార్ రేస్ పోటీలు జరుగుతున్నాయి. ‘దక్షణి డేర్ క్రాస్ కంట్రీ ర్యాలీ అండ్ బైక్ రేస్’ పేరిట ఈ పోటీలను 3 రోజులపాటు నిర్వహిస్తున్నారు. పుట్లూరు మండలం నుంచి నార్పల మండలం వరకూ ఉన్న కొండ ప్రాంతాల్లో జరుగుతున్న బైక్, కార్ రేస్‌లో ఏపీ, తెలంగాణ, గోవా, తమిళనాడు, కేరళల రేసర్లు పాల్గొన్నారు.