Raghurama Krishnam Raju Case: న్యాయ వర్గాల్లో విస్మయం

Legal circles awe on Raghurama Krishnam Raju Case - Sakshi

రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఐడీని ప్రతివాదులుగా తొలగించడం ఏమిటి?

సాక్షి, అమరావతి: తన తండ్రిని సీఐడీ అధికారులు హింసించారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ పిటిషన్‌ దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు కె.భరత్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది మంగళవారం సుప్రీంకోర్టులో వినిపించిన వాదనలపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

సీఐడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన భరత్‌ ఇప్పుడు తన పిటిషన్‌లో ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రభుత్వం, సీఐడీలను తొలగించాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేయడం, అందుకు సుప్రీంకోర్టు అంగీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కనీసం వారి వాదనలు వినిపించే అవకాశం కూడా లేకుండా చేయడంతో పాటు సీబీఐ దర్యాప్తును వ్యతిరేకించే అవకాశం లేకుండా చేసేందుకే ఇలా వ్యూహాత్మకంగా చేస్తున్నారన్న అనుమానాలను న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.  

న్యాయ సూత్రాల ప్రకారం.. 
ఒక వ్యక్తి లేదా సంస్థపై ఆరోపణలు చేస్తూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ఆ వ్యక్తి లేదా సంస్థను ప్రతివాదిగా చేర్చడం తప్పనిసరి. ఇది అందరూ పాటించే న్యాయ నియమం. అలా ప్రతివాదిగా లేదా ప్రతివాదులుగా చేరిస్తే కోర్టు వారికి నోటీసులు జారీ చేసి ఆరోపణలపై వివరణ కోరుతుంది. తద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లేదా సంస్థ తన వాదనలను వినిపించుకునే అవకాశంతో పాటు జరిగింది న్యాయస్థానానికి నివేదించే వీలుంటుంది. ఇది సహజ న్యాయ సూత్రం కూడా. న్యాయ సూత్రాల్లో ‘ఆడి ఆల్ర్టమ్‌ పార్టమ్‌’ (ప్రతివాదుల వాదనలు కూడా వినాలి) చాలా ముఖ్యమైనది. ఇప్పుడు భరత్, ఆయన న్యాయవాదులు ఈ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారు.

భరత్‌ తన పిటిషన్‌లో సీఐడీపై పలు ఆరోపణలు చేయడమే కాకుండా దురుద్దేశాలు కూడా ఆపాదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం దురుద్దేశాలు అంటగట్టారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ ప్రతివాదులుగా ఉండటం తప్పనిసరి. తద్వారా అటు సీఐడీకి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తమపై వచి్చన ఆరోపణలకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది. రఘురామకృష్ణరాజు గాయాలపై వాస్తవాలను కోర్టుకు వివరించడానికి ఆస్కారం ఉంటుంది.

జీజీహెచ్‌ మెడికల్‌ బోర్డు నివేదికలోని అంశాలతో పాటు ఆర్మీ ఆసుపత్రి నివేదికలోని అంశాలపై కూడా సుప్రీంకోర్టు ముందు గట్టిగా వాదనలు వినిపించవచ్చు. ఇప్పుడు అవన్నీ లేకుండా చేశారని, ఇది ఎంత మాత్రం సరికాదని, ఇలా చేయడం ద్వారా భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేకుండా పోయిందని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సుప్రీంకోర్టు తదుపరి విచారణ సమయంలో ఈ విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందని ఆ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

ప్రతివాదులుగా ఉండటం తప్పనిసరి... 
రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వారు ప్రతివాదులుగా ఉండటం తప్పనిసరి. అప్పుడే సహజ న్యాయ సూత్రాలను పాటించడం సాధ్యమవుతుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రతివాదులుగా లేకుంటే వారి వాదన ఎవరికి వినిపించాలి? కోర్టు వారి వాదనలు వినకుండా పిటిషనర్‌ కోరిన ఉత్తర్వులు ఇచ్చేందుకు వీల్లేదు. ప్రతివాదులుగా చేర్చి ఆ తరువాత వారిని తీసేస్తే ఎందుకు తీసేస్తున్నామో కారణాలు చెప్పాలి. ఆ కారణాలు సహేతుకమైనవో కావో కోర్టు విచారించి నిర్ణయం వెలువరించాలి. ఈ కేసులో అలా జరగలేదంటే అది సహజ న్యాయ సూత్రాలను పాటించకపోవడమే అవుతుంది.   
 – ఎల్‌.రవిచందర్, సీనియర్‌ న్యాయవాది 

ఆ పిటిషన్‌కు విచారణార్హతే లేదు 
రఘురామకృష్ణరాజు కుమారుడు తన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఐడీకి వ్యతిరేకంగా సీబీఐ దర్యాప్తు కోరుతున్నారు. అలాంటప్పుడు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులుగా ఉండొద్దంటే ఎ లా? ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన హక్కు సీఐడీకి, ప్రభుత్వానికి ఉంది. ఆ హక్కును కాలరాసే విధంగా సీఐడీ, ప్రభుత్వాన్ని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించారు. ఈ పరిస్థితుల్లో భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హతే లేదు. ఇంత చిన్న కేసు కూడా సీబీఐకి అప్పగించాలంటే ఎలా? 
– ఎస్‌.శరత్‌ కుమార్, న్యాయవాది  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top