
పోలీస్ కస్టడీలో అరుణ సమాధానాలు
విచారణ అనంతరం జిల్లా కేంద్ర కారాగారానికి తరలింపు
నెల్లూరు జిల్లా: బిల్డర్‌ను బెదిరించిన ఘటనలో ఒంగోలు జైల్లో రిమాండ్‌లో ఉన్న నిడుగుంట అరుణను కోర్టు అనుమతితో కోవూరు పోలీసులు మూడు రోజుల కస్టడీకి గురువారం తీసుకున్నారు. ఎస్సై రంగనాథ్‌గౌడ్ నేతృత్వంలో సిబ్బంది ఆమెను ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. సీఐ సుధాకర్‌రెడ్డి ఆమెను సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించారు. తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానంటూ అన్నింటికీ సమాధానాలిచ్చారని సమాచారం. విచారణ అనంతరం ఆమెను జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.
మోసాలు.. ఒక్కొక్కటిగా బయటకు
పట్టాల పేరిట అరుణ మోసగించిందని కోవూరు పోలీసులకు పలువురు గిరిజనులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. గంజాయి కేసుల్లోనూ ఆమె ప్రమేయం ఉందంటూ మరో పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. అరెస్ట్ సమయంలో ఆమె సెల్‌ఫోన్లను పోలీస్ అ«ధికారులు సీజ్ చేశారు. కాల్‌డీటైల్స్ ఆధారంగా ఇప్పటికే అనేక మంది రౌడీïÙటర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీకి తీసుకొని సమాచారాన్ని పూర్తిస్థాయిలో రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు అరుణ ఫోన్ డేటాను సేకరిస్తున్నారు. అందులో కీలక సమాచారం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోన్ డేటా బయటకొస్తే అనేక మంది గుట్టురట్టయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో అరుణతో సన్నహితంగా ఉన్న వారిలో అలజడి మొదలైంది. విచారణ విషయాలు బయటకు పొక్కకుండా పోలీస్ అధికారులు గోప్యత పాటిస్తున్నారు.
గుండెల్లో దడ మొదలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కిలేడి అరుణకు సహకరించిన వ్యక్తుల గుండెల్లో దడ మొదలైంది. పోలీస్ కస్టడీలో తమ పేర్లను బయటపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది.. తమను అరెస్ట్ చేస్తారాననే ఆందోళన వారిలో స్టార్టయింది. ఈ క్రమంలోనే రాష్ట్ర పోలీస్ బాస్ జిల్లాకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కోవూరు పోలీస్‌స్టేషన్లో నమోదైన కేసులో ఒంగోలు జైల్లో రిమాండ్‌లో ఉన్న అరుణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
మిగిలిన రెండు రోజుల్లో వీలైనంత సమాచారాన్ని రాబట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఆమె ముఖ్య అనుచరులైన నలుగుర్ని నెల్లూరు నగర పోలీసులు అదుపులోకి తీసుకొని కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నారని తెలిసింది. వీరిలో ఇద్దరు సుమారు ఆరేళ్ల క్రితం రైల్లో జరిగిన నగదు దోపిడీ కేసులో నిందితులని సమాచారం. ఆమెతో కలిసి వీరు దౌర్జన్యాలు చేశారనే అంశాన్ని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. వీరిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. మరోవైపు తిరుపతి జిల్లాలోనూ శ్రీకాంత్, అరుణకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని అక్కడ జరిగిన కొన్ని నేరాల్లో వీరి ప్రమేయం ఏమైనా ఉందాననే కోణాల్లో విచారణ జరుపుతున్నారని తెలిసింది.