చంద్రబాబు ఖైదీ నెంబర్‌ 7691 | Chandrababu taken to Rajahmundry Central Jail in Skill Development Scam | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఖైదీ నెంబర్‌ 7691

Sep 11 2023 5:08 AM | Updated on Sep 11 2023 8:56 AM

Chandrababu to Rajahmundry Central jail In Skill Development Scam - Sakshi

ఆదివారం అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లోకి వెళ్తున్న చంద్రబాబు

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో..  చంద్రబాబు ఖైదీ నెంబర్‌ 7691..

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం సాయంత్రం 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి బి.సత్య వెంకట హిమబిందు ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. అక్కడ ఆయనను ప్రత్యేక గదిలో ఉంచాలని స్పష్టం చేశారు.

జైలులో తగిన భద్రతను కూడా కల్పించాలని ఆదేశించారు. ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్‌ తెప్పించుకునేందుకు అనుమతించారు. న్యాయమూర్తి ఉత్తర్వులు వెలువరించిన తర్వాత వారెంట్‌ కాపీ సిద్ధం చేసేందుకు కొంత సమయం పట్టడంతో చంద్రబాబు తన న్యాయవాదులతో కలిసి కోర్టు ప్రాంగణంలో ఉన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయంలో కూర్చున్నారు. ఈ లోపు జైలుకెళ్లకుండా తప్పించుకునేందుకు చంద్రబాబు, ఆయన న్యాయవాద బృందం ఎత్తులు వేసింది.


ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్‌ తెప్పించుకునేందుకు ఓ పిటిషన్, జైలుకు కాకుండా ఇంటి వద్దనే హౌస్‌ అరెస్ట్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. హౌస్‌మోషన్‌ రూపంలో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ జరిపారు. ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్‌ తెప్పించుకునేందుకు సీఐడీ న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే హౌస్‌ అరెస్ట్‌ విషయంలో మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు.

ఓసారి నిందితునికి రిమాండ్‌ విధించిన తర్వాత ఆ ఉత్తర్వులను మార్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అసాధారణ, అరుదైన పరిస్థితుల్లో మాత్రమే హౌస్‌ అరెస్ట్‌ ఉత్తర్వులు ఇవ్వడానికి ఆస్కారం ఉందని తెలిపారు. ప్రస్తుతం అలాంటి అసాధారణ, అరుదైన పరిస్థితులు ఏవీ లేవన్నారు. ఈ పిటిషన్‌ విషయంలో అధికారులతో సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, అందుకు తమకు ఓ రోజు గడువు కావాలని న్యాయమూర్తిని కోరారు.

హౌస్‌ అరెస్ట్‌ ఉత్తర్వుల కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు గట్టిగా పట్టుబడ్డారు. అయితే న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో రిమాండ్‌కు సంబంధించిన వారెంట్‌ కాపీ సిద్ధం కావడంతో పోలీసులు ఆ కాపీని చంద్రబాబుకు చూపారు. తాము దాఖలు చేసిన హౌస్‌ అరెస్ట్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని, అందువల్ల జైలుకు తరలించలేరని కొందరు టీడీపీ న్యాయవాదులు పోలీసులతో ఒకింత వాగ్వాదానికి దిగారు.

అయితే పోలీసులు మాత్రం కోర్టు వారెంట్‌ జారీ చేసిన నేపథ్యంలో జైలుకు తరలించి తీరాల్సిందేనని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడ కోర్టులోని మూడో అంతస్తు నుంచి లిఫ్ట్‌లో కిందకు తీసుకొచ్చి వాహనాల్లో రాజమండ్రి జైలుకు తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఇరు పక్షాల వాదనల వివరాలు ఇలా ఉన్నాయి.

తనకేం సంబంధం లేదన్న బాబు 
అంతకు ముందు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో కీలక నిందితునిగా ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు శనివారం ఉదయం ఆరు గంటలకు నంద్యాలలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 5.40 గంటలకు సీఐడీ అధికారులు ఆయన్ను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా పోలీసులు ఏసీబీ కోర్టు చుట్టు పక్కల గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యాయవాదులను మినహా మిగిలిన వారెవ్వరినీ కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు. 6.40 గంటలకు చంద్రబాబు కోర్టు హాలులోకి వచ్చి కూర్చున్నారు. 8 గంటలకు విచారణ మొదలైంది. ఈ సందర్భంగా చంద్రబాబును న్యాయమూర్తి కొన్ని ప్రశ్నలు అడిగారు.

వాటికి చంద్రబాబు సమాధానం ఇస్తూ, ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని.. చట్టం, నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా ఇష్టారీతిన అరెస్టులు చేస్తోందని వివరించారు. తనను ఎప్పుడు అరెస్ట్‌ చేశారు.. అధికారులు తన పట్ల ఎలా వ్యవహరించారు.. తదితర వివరాలను కోర్టుకు వివరించారు.

అర్ధరాత్రి 11 గంటల సమయంలో తనను నిర్భంధంలోకి తీసుకుని, ఉదయం 6 గంటలకు అరెస్ట్‌ చూపారని తెలిపారు. రెండేళ్ల తర్వాత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో పోలీసులు తనను 37వ నిందితునిగా చూపి అరెస్ట్‌ చేశారని చెప్పారు. ఈ స్కామ్‌తో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు.  

దోచేసిన మొత్తమంతా ప్రజల డబ్బే..
సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, చంద్రబాబును శనివారం ఉదయం 6 గంటలకే అరెస్ట్‌ చేశామని కోర్టుకు నివేదించారు. దీనిని ధ్రువీకరిస్తూ చంద్రబాబు సంతకం కూడా చేశారని తెలిపారు. అరెస్ట్‌ సమయంలో చంద్రబాబు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. ఆయన్ను 24 గంటల ముందే కోర్టు ముందు హాజరు పరిచామన్నారు.

ఇది కూడా పాపమేనా? అని ప్రశ్నించారు. చట్ట ప్రకారం కోర్టు ముందు హాజరు పరిచినా ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు రూ.371 కోట్లను దోచేశారని ఆయన కోర్టుకు నివేదించారు. షెల్‌ కంపెనీలను సృష్టించి పెద్ద మొత్తాలను దారి మళ్లించారని వివరించారు. ఈ మొత్తం అంతా పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బు అని తెలిపారు.

దోచయడమే చంద్రబాబు విజన్, మిషన్‌ 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో 35వ నిందితునికి గతంలో ఇదే కోర్టు రిమాండ్‌ తిరస్కరించిందని, దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించి రిమాండ్‌ తిరస్కరణ ఉత్తర్వులను రద్దు చేయించామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా హైకోర్టు, రిమాండ్‌ సమయంలో కింది కోర్టులు ఎలా వ్యవహరించాలో స్పష్టంగా చెప్పిందన్నారు.

రిమాండ్‌ సమయంలో మినీ ట్రయల్‌ నిర్వహించడం తగదని, ఏ సెక్షన్‌ వర్తిస్తుంది.. ఏ సెక్షన్‌ వర్తించదు అన్న విషయాలను తేల్చరాదని తెలిపిందన్నారు. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం తీవ్రమైనదని, ప్రజాధనాన్ని లూటీ చేయడంలో చంద్రబాబు ‘స్కిల్‌’ చూపారని తెలిపారు. ప్రజాధనాన్ని దోచేయడమే చంద్రబాబు విజన్, మిషన్‌ అని కోర్టుకు నివేదించారు.

సీమెన్స్‌ కంపెనీ ద్వారా రూ.371 కోట్లను దారి మళ్లించడంలో చంద్రబాబుది కీలక పాత్ర అని తెలిపారు. దీనిపై జర్మనీలోని సీమెన్స్‌ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా, అసలు సీమెన్స్‌ ఇండియా కుదుర్చుకున్న ఒప్పందాల సంగతి ఏమీ తమకు తెలియదని చెప్పిందన్నారు. సీమన్స్‌ ఇండియా కార్యకలాపాలపై అంతర్గత విచారణ జరిపించిందని తెలిపారు. ఇందులో సీమెన్స్‌ అక్రమాలన్నీ వెలుగు చూశాయన్నారు.

ఈ స్కామ్‌ను ఓ విజన్‌గా భావించారు 
అసలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గానీ, సీఐడీ గానీ వెలికి తియ్యలేదు. పూణే జీఎస్‌టీ అధికారులు ఈ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చి, గత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు. అయితే గత చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని తమతో కుమ్మక్కైన కంపెనీలకు తెలియజేసిందన్నారు.

ఆ తర్వాత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందన్నారు. చంద్రబాబు ప్రతి దానిని విజన్‌ కోణంలోనే చూస్తారని, ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ను కూడా విజన్‌లో భాగంగానే ఆయన భావించారని నివేదించారు.

ఎలాంటి సంతకాలు, తేదీలు లేకుండా అప్పనంగా రూ.371 కోట్లను విడుదల చేసేయాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. షెల్‌ కంపెనీలు, బోగస్‌ బిల్లులు సృష్టించి రూ.కోట్లు కొల్లగొట్టారన్నారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు కీలక పాత్రధారి అని తెలిపారు. అందువల్ల ఆయనకు రిమాండ్‌ విధించాల్సిన అవసరం ఉందన్నారు.

రాజకీయ కారణాలతోనే అరెస్ట్‌ 
అనంతరం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. అందులో భాగంగానే దురుద్దేశాలతో చంద్రబాబును అరెస్ట్‌ చేసిందన్నారు. రాజకీయ కారణాలతోనే ఆయన్ను అరెస్ట్‌ చేశారని తెలిపారు. సిద్ధాంతాలు, నైతిక విలువలను పక్కన పెట్టేసిందని చెప్పారు.

సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద నమోదు చేసే వాంగ్మూలాలకు ఎలాంటి విలువ లేదన్నారు. 2.30 లక్షల మంది విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచేందుకు సీమెన్స్‌తో ఒప్పందం కుదర్చుకుందన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. ఈ ఒప్పందంలో అప్పటి అధికారులు కొందరు కీలక పాత్ర పోషించారని, ప్రభుత్వం వారి జోలికి వెళ్లడం లేదన్నారు.

ఏమీ జరగని దానికి ఏదో జరిగినట్లు చెబుతూ, దానిని ఓ స్కామ్‌గా పేర్కొంటూ చంద్రబాబును అరెస్ట్‌ చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై నమోదు చేసిన ఒక్కో సెక్షన్‌ ఆయనకు ఏ విధంగా వర్తించదో వివరించారు. చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లలో ఒక్క అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌) కింద నమోదు చేసిన కేసులు మినహా మిగిలినవన్నీ నామమాత్రపు కేసులేనన్నారు.

ఐపీసీ సెక్షన్‌ 409 (నేరపూరిత విశ్వాస ఘాతుకం) అసలు వర్తించదన్నారు. పీసీ యాక్ట్‌ కింద నమోదు చేసిన కేసులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరన్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబుపై నమోదు చేసిన కేసులో ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిపారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ఏర్పాటు క్యాబినెట్‌ నిర్ణయమని, ఆ నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదించడానికి వీల్లేదన్నారు. చంద్రబాబును నంద్యాలలో అక్రమంగా అరెస్ట్‌ చేశారన్నారు. ఆయనను అరెస్ట్‌ చేసిన, విచారించిన అధికారుల సెల్‌ డేటా వివరాలను భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

కొనసాగిన సుదీర్ఘ వాదనలు 
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఈ మధ్యలో న్యాయమూర్తి రెండుసార్లు విరామం ఇచ్చారు. భోజన విరామం తర్వాత ఓ గంటపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో తన ఉత్తర్వులను వెలువరించారు.

చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నట్లు న్యాయమూర్తి ఓపెన్‌ కోర్టులో ఉత్తర్వులు చదివి వినిపించారు. దీంతో కోర్టు హాలులో ఉన్న చంద్రబాబుతో సహా టీడీపీ న్యాయవాదులంతా ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. కోర్టు హాలులో ఉన్న నారా లోకేష్‌ ముఖకవళికలు మారిపోయాయి.

అనంతరం పోలీసులు చంద్రబాబును కోర్టు హాలులో నుంచి కోర్టు ప్రాంగణంలో ఉన్న పీపీ కార్యాలయంలో కూర్చోబెట్టారు. జైలుకెళ్లడం ఖాయం కావడంతో చంద్రబాబు, ఆయన న్యాయవాద బందం అప్రమత్తమై అప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేసినా ఫలించలేదు.  

శనివారం మధ్యాహ్నం నుంచే హడావుడి 
చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో శనివారం మధ్యాహ్నం నుంచే అసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబును నంద్యాల నుంచి తీసుకుని సీఐడీ పోలీసులు విజయవాడకు బయలుదేరడంతో మధ్యాహ్నం 1 గంటకే టీడీపీ న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిద్దార్థ లూథ్రా వచ్చారు.

ఆయనతో పాటు చంద్రబాబు న్యాయవాద బృందం అంతా కూడా వాదనలకు సర్వం సిద్ధం చేసుకుంది. చంద్రబాబును కోర్టు ముందు హాజరు పరిచేందుకు ఎదురు చూస్తూ కోర్టులోనే కూర్చొన్నారు. రాత్రి 8 గంటల వరకు వేచి చూసిన బాబు న్యాయవాద బృందం, ఎంతకూ కోర్టు ముందు హాజరు పరచకపోవడంతో హౌస్‌ మోషన్‌ రూపంలో ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది.

చంద్రబాబును తక్షణమే కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు తన విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు లీక్‌ చేయకుండా, తనను అరెస్ట్‌ చేసిన పోలీసుల కాల్‌ డేటాను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను తీసుకుని టీడీపీ న్యాయవాదులంతా న్యాయమూర్తి ఇంటి వద్దకు చేరుకున్నారు.

అయితే ఈ పిటిషన్‌ను విచారించే పరిస్థితి లేకపోవడంతో వారు వెనుదిరిగారు. రాత్రి కావడంతో సిద్దార్థ లూథ్రా తదితరులు హోటల్‌కు వెళ్లిపోయారు. మిగిలిన న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలోనే తమ తమ కార్లలో నిద్రపోయారు.

న్యాయవాదులతో కిక్కిరిసిన కోర్టు హాలు 
ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి కోర్టు ప్రాంగణంలో హడావుడి మొదలైంది. ఏ క్షణమైనా సిఐడీ అధికారులు చంద్రబాబును కోర్టు ముందు హాజరు పరచే అవకాశం ఉందనే వార్తలు రావడంతో అందరూ కోర్టు హాలు వద్దకు చేరుకున్నారు. సిద్ధార్థ లూథ్రా సైతం 5.30 గంటలకల్లా కోర్టుకొచ్చేశారు.

ఆయనతో పాటు సీనియర్‌ న్యాయవాదులు కనకమేడల రవీంద్ర కుమార్, దమ్మాలపాటి శ్రీనివాస్, టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ప్రణతి, గింజుపల్లి సుబ్బారావు, సువ్వారి శ్రీనివాస్, పుల్లగూర నాగరాజు, అప్పసాని వినీత్‌ తదితరులు శనివారం నుంచే కోర్టు వద్ద ఉన్నారు.

సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నాగిరెడ్డి, అదనపు పీపీ ఎస్‌.దుష్యంత్‌రెడ్డి, స్పెషల్‌ పీపీ వివేకానంద, ఏజీపీలు బాలకృష్ణ, సుమన్, న్యాయవాదులు శరణ్, కృష్ణలతో పాటు విజయవాడకు చెందిన న్యాయవాదులు ఉదయం 5.20 గంటలకు ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు.

న్యాయవాదులతో కోర్టు హాలు కిక్కిరిసింది. 5.40 గంటలకు సీఐడీ అధికారులు చంద్రబాబును ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు హాలులో పెద్ద సంఖ్యలో ఉన్న న్యాయవాదుల వల్ల విచారణకు అటంకం కలుగుతుండటంతో న్యాయమూర్తి కొందరు న్యాయవాదులను బయటకు పంపి విచారణను కొనసాగించారు.
 
పోటీగా పోటీగా ఇరుపక్షాల న్యాయవాద బృందాలు 
చంద్రబాబు రిమాండ్‌ విషయంలో అటు టీడీపీ న్యాయవాద బృందం, ఇటు సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాద బృందం పోటా పోటీగా వాదనలు వినిపించాయి. ఎలాగైనా చంద్రబాబుకు రిమాండ్‌ విధించకుండా చూడాలన్న పట్టుదలతో టీటీడీ న్యాయవాదులు వ్యవహరించగా, రిమాండ్‌ విధించేలా చేయాలని సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాదులు అంతే పట్టుదల చూపారు.

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రతీ కేసులో న్యాయవాదిగా వ్యవహరిస్తున్న సిద్దార్థ లూథ్రా నేతృత్వంలో సీనియర్‌ న్యాయవాదులు, జూనియర్‌ న్యాయవాదులు పనిచేశారు. మరో వైపు అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు గట్టి వాదనలను వినిపించారు.

ఇరుపక్షాలు కూడా వాదనల సమయంలో పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల తీర్పులను ఉదహరించారు. ఆయా చట్ట నిబంధనలకు తమదైన భాష్యం చెప్పారు. ఓ దశలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ తమ న్యాయవాదులను అభినందించి, తమదే విజయం అన్న ధీమాను ప్రదర్శించారు. వాదనలు జరుగుతున్నంత సేపు లోకేష్‌ కోర్టు హాలులోనే ఉన్నారు. అలాగే చంద్రబాబును చూసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు తరలివచ్చారు. చంద్రబాబుకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement