
విజయనగరం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు
డీఎస్సీలో మెరిట్ ఉన్నా కాల్ లెటర్లు పంపని సర్కారు
పలు కేటగిరీల్లో అభ్యర్థుల ఆందోళన..
ఈపీటీ అవసరం లేకున్నా ఉండాల్సిందేనని మెలిక
‘స్పెషల్’ టీచర్ పోస్టుల భర్తీలో గందరగోళం
తక్కువ మార్కులు వచ్చిన వారికే తొలుత కాల్ లెటర్లు
నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా నిర్వహణ
నియామక ప్రక్రియలో అడుగడుగునా అవకతవకలు
కనిపించని పారదర్శకత.. ఆందోళనలో మెరిట్ అభ్యర్థులు
తక్కువ ర్యాంక్ వారికి కాల్ లెటర్లు
డీఎస్సీలో నాకు బీసీ–ఎ కేటగిరీలో 5వ ర్యాంకు వచ్చింది. ఇదే కేటగిరీలో నాకంటే ముందున్న నలుగురికి, నా తర్వాత 6, 7 ర్యాంకుల వారికి కాల్ లెటర్లు వచ్చాయి. నాకు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. అధికారులకు చెబితే వెయిట్ చేయండి అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– శెట్టి బాబూరావు, సంగం మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
18 పోస్టులుంటే 14 మందికే పిలుపు
విజయనగరం జిల్లా డీఎస్సీలో ఎస్జీటీకి సంబంధించి బీసీ–ఏ విభాగంలో 18 పోస్టులు ఉన్నాయి. ఈ లెక్కన 18 మంది మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు రావాలి. అయితే ఒకటి నుంచి 14వ ర్యాంకు వరకు మాత్రమే పిలిచారు. 16వ ర్యాంకు వచ్చిన నాతో సహా 15, 17, 18 ర్యాంకుల వారికి కాల్ లెటర్లు రాలేదు. డీఈవోకు వినతిపత్రం అందజేశాం. పరిశీలిస్తామని చెప్పారు.
– శ్రావ్య, విజయనగరం జిల్లా ఎస్జీటీ అభ్యర్థిని
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: డీఎస్సీ నియామకాల్లో కూటమి ప్రభుత్వ కుతంత్రం కొత్త పుంతలు తొక్కుతోంది. అభ్యర్థులను మోసగిస్తున్న తీరు రోజుకో రూపంలో బయట పడుతోంది. కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’ల పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యాన్ని నట్టేట ముంచేసినట్టే.. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఇంకా కాల్ లెటర్లు పంపక పోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు.. వెనుక ఉన్న వారికి లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వక పోవడంపై అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది.
దీంతో పాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులు సైతం రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్‌సైట్ నుంచి డేటా తొలగించి, నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం. ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాసవ్వలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు.
ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 15 వేల మందికి పైగా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపామని అధికారులు చెబుతున్నా ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలేదు’ అని చెబుతున్న వారు వేలల్లో జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళనలకు దిగారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అంత దారుణంగా అక్రమాలు జరుగుతుంటే, అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు.. రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముందు దబాయించి.. తర్వాత జారుకుని..
డీఎస్సీ నిర్వహణ తీరు పారదర్శకంగా, చట్టంలో పొందు పరిచిన నిబంధనల ప్రకారం కంటే.. కూటమి రాజకీయ వార్ రూమ్ నుంచి క్షణక్షణం నిర్ణయాలను మార్చుకునే అనుకూలత మధ్య సాగుతోందని విమర్శలొస్తున్నాయి. టీజీటీ–స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం చూస్తుంటే.. ప్రభుత్వం నిర్లజ్జగా తన అక్రమాల నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది.
తాను పొందుపరిచిన నిబంధనలను చివరి నిమిషంలో విశృంఖలంగా మార్చేసి వేలాది మంది అభ్యర్థుల జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొడుతోంది. వాస్తవానికి టీజీటీ–స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులైన గణితం, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్షలు రాసిన వారికి ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టు అవసరం లేదని నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా పేర్కొన్నారు. పైగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ సిలబస్, పరీక్ష విధానం.. చివరికి హాల్ టికెట్‌లోనూ ఇదే అంశాన్ని పొందు పరిచారు.
ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులు మంచి మార్కులతో అర్హత సాధించారు. తీరా, కాల్ లెటర్లు పంపే సమయంలో టీజీటీ–స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఈపీటీ పాస్ కాలేదని పేర్కొంటూ వారిని అనర్హులుగా ప్రకటించడం డీఎస్సీ పారదర్శకతనే ప్రశ్నిస్తోంది. పరిస్థితిని గుర్తించిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను నేరుగా సంప్రదిస్తే.. అధికారులు దబాయింపునకు దిగారని వాపోయారు.
ఆధారాలను చూపితే.. చివరికి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. అందుకు అనుగుణంగా స్పెషల్ టీజీటీ పోస్టులకు ఈపీటీ తప్పనిసరి అని ఉన్న కాలమ్‌ను శనివారం వెబ్‌సైట్ నుంచి తొలగించారు. కానీ, అర్హులకు కాల్ లెటర్లు పంపేదానిపై స్పష్టత ఇవ్వలేదు.
అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు
డీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సర్టిఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడుస్తోంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు కూడా ఆయా పరీక్షలను వేర్వేరుగా నిర్వహించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు.
ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా, దరఖాస్తులో తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా, కేవలం ఒక్క పోస్టు(ఎస్జీటీ)కే పరిమితం చేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రహసనంగా మార్చేసిన తీరుపై అభ్యర్థుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇదిలా ఉండగా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 46 మంది అభ్యర్థులు తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని రాత పూర్వకంగా డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వికలాంగుల కోటాలో తనకు అర్హత ఉన్నప్పటికీ కాల్ లెటర్ రాలేదని కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన జరుగు సుమతి ఆవేదన వ్యక్తం చేశారు.
విజయనగరంలో ఆందోళన
మెగా డీఎస్సీలో బీసీ–ఏ రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందంటూ విజయనగరం కలెక్టరేట్‌లోని డీఈఓ కార్యాలయం వద్ద శనివారం ఎస్జీటీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డీఎస్సీలో మొత్తం 272 పోస్టులుండగా కేవలం 16 మందినే పిలిచారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన వారెవరికీ కాల్ లెటర్స్, మెసేజ్‌లు రాలేదని వాపోయారు.
విజయనగరానికి చెందిన బీసీ–ఏ ఎస్జీటీ అభ్యర్థి శ్రావ్య, మరో 14 మంది డీఈఓ మాణిక్యంనాయుడును కలిసి, తమకు అర్హత ఉన్నా కాల్ లెటర్స్ రాలేదని విన్నవించారు. ఈ సందర్భంగా డీఈవో స్పందిస్తూ.. మరోసారి కమిటీ మొత్తం కూర్చొని అభ్యర్థుల డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. అప్పటికీ న్యాయం జరగలేదనుకుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు.