
బార్లకు ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులు వేయకుండా వదిలివేత
840 బార్లలో 300 బార్లకే దరఖాస్తుల దాఖలు
దరఖాస్తులు రాలేదనే సాకుతో అదనపు లాభాల మార్జిన్ పెంచి కొల్లగొట్టేందుకు పన్నాగం
సాక్షి, అమరావతి: బార్ల ముసుగులో దోపిడీకి టీడీపీ సిండికేట్ పన్నాగం పన్నుతోంది. ఉద్దేశపూర్వకంగానే దరఖాస్తులు దాఖలు చేయకుండా కుట్రపన్నుతోంది. దశలవారీగా బార్లను లాటరీ విధానంలో దక్కించుకోవడంతోపాటు ఆ గడువులోగా దరఖాస్తులు రాలేదనే సాకుతో అదనపు 15శాతం లాభాల మార్జిన్ పెంచి కొల్లగొట్టేలా కథ నడిపిస్తోంది. ఆ ఎత్తుగడలో భాగంగానే రాష్ట్రంలో నోటిఫికేషన్ జారీ చేసిన అన్ని బార్లకు పూర్తిగా దరఖాస్తులు దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వక తాత్సార వైఖరి ప్రదర్శించింది. వేరే వాళ్లను దరఖాస్తులు దాఖలు చేయనివ్వడం లేదు.
రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీ చేయగా... దరఖాస్తుల దాఖలుకు మొదట ఈ నెల 27ను గడువుగా నిర్ణయించారు. ఆ తరువాత ఆ గడువును శుక్రవారం వరకు పొడిగించారు. శుక్రవారంతో గడువు ముగిసేసరికి దాదాపు 300 బార్లకు మాత్రమే కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి.
నిబంధనల ప్రకారం కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చే బార్లకే లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. మిగిలిన 540 బార్లకు మరికొన్ని దశల్లో నోటిఫికేషన్ జారీ చేసి... వాటిని కూడా ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు కేటాయించేలా పన్నాగాన్ని అమలు చేస్తున్నారు. శుక్రవారంనాటికి దాఖలైన 300 బార్లకు శనివారం లాటరీ విధానంలో ఎక్సైజ్ శాఖ లైసెన్సులు కేటాయించనుంది.