AP: చిన్న పరిశ్రమలకు చికిత్స

AP Govt giving special attention to struggling MSMEs - Sakshi

కష్టాల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

మూడేళ్ల ఆదాయం ఆధారంగా వాటి ఆర్థిక పరిస్థితి విశ్లేషణ

ఆదాయం తగ్గుతున్న యూనిట్లు గుర్తించి కారణాల అన్వేషణ

ప్రభుత్వపరంగా అవసరమైన సహాయం అందించేందుకు ప్రణాళిక

రాష్ట్రంలోని 2.50 లక్షల ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక డ్రైవ్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభంతో దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ముఖ్యంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న సంస్థలను గుర్తించి వాటికి తోడ్పాటునందించే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల మూడేళ్ల ఆదాయ వివరాలను పరిశీలించనుంది. వరుసగా ఆదాయం తగ్గుతున్న యూనిట్లను గుర్తించి వాటికి సహకారం అందించాలని భావిస్తోంది.

2019–20 నుంచి 2021–22 వరకు మూడేళ్లలో చెల్లించిన ఎస్‌జీఎస్‌టీలను పరిశీలించి తద్వారా ఆదాయం తగ్గిన యూనిట్లను గుర్తిస్తున్నట్లు ఏపీఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంకా రవీంద్రనాథ్‌ తెలిపారు. ఇలా గుర్తించిన యూనిట్లలో ఆదాయం తగ్గడానికి గల కారణాలను అన్వేషించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించాలన్న దానిపై జిల్లాల వారీగా వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆదాయం తగ్గడానికి విద్యుత్, ముడి సరుకు, ఆర్థిక ఇబ్బందులు, మార్కెటింగ్, కూలీల కొరత తదితర కారణాలను గుర్తించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. 

పటిష్టమైన కార్యాచరణ రూపకల్పన
ఇక రాష్ట్రంలో 2.50 లక్షలకు పైగా ఎంఎస్‌ఎంఈలు ఉండగా, ఇందులో 88 శాతానికి పైగా సూక్ష్మ తరహా యూనిట్లే ఉన్నాయి. 1,100 మధ్య తరహా.. 10,000కు పైన చిన్న పరిశ్రమలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఏ ఒక్క ఎంఎస్‌ఎంఈ పరిశ్రమ మూతపడకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కష్టాల్లో ఉన్న యూనిట్లకు జీవితకాలం చేయూతనిచ్చే విధంగా పటిష్టమైన కారా>్యచరణ ప్రణాళికను సిద్ధంచేస్తున్నట్లు రవీంద్రనాథ్‌ తెలిపారు. ఇప్పటికే దేశంలో మొదటిసారిగా కరోనా కష్టకాలంలో రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు గత టీడీపీ ప్రభుత్వ బకాయిలతో కలిపి రూ.2,000 కోట్లకు పైగా రాయితీలను ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చింది.

ఇలాగే వరుసగా మూడో ఏడాది కూడా వచ్చేనెలలో ఇవ్వడానికి సర్కారు రంగం సిద్ధంచేసింది. అదే విధంగా.. ఇప్పటికే వ్యాపారం చేస్తూ ఎంఎస్‌ఎంఈగా నమోదు చేసుకోకపోవడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందనటువంటి సంస్థలను సైతం గుర్తించి వాటిని నమోదుచేసే ప్రక్రియను ప్రభుత్వం  ప్రారంభించింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ ‘ఉదయం’ పోర్టల్‌లో కనీసం 1.25 లక్షల యూనిట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లను నమోదుచేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, కొత్తగా 4,000 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఈ ఏడాది ప్రారంభమయ్యాయి.

ఎన్‌ఎస్‌ఐసీతో ఏపీఎంఎస్‌ఎంఈడీసీ ఒప్పందం..
రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకేసింది. కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ఐసీ)తో ఏపీఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎంఎస్‌ఎంఈడీసీ చైర్మన్‌ వంకా రవీంద్రనాథ్‌ సమక్షంలో ఎన్‌ఎస్‌ఐసీ జోనల్‌ హెడ్‌ కె. శ్రీనివాస్, ఏపీఎంఎస్‌ఎంఈడీసీ సీఈఓ సృజన సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంవల్ల రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లలో ఏర్పాటవుతున్న చిన్న పరిశ్రమలకు సాంకేతిక సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకు తక్కువ వడ్డీరేటుతో ఆరు నెలల్లో తీర్చుకునే విధంగా అప్పుపై ముడి సరుకులు పొందే అవకాశం కలుగుతుందన్నారు. అలాగే.. నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ట్రేడ్‌ ఫెయిర్స్‌లో పాల్గొనే అవకాశం వంటివి లభించనున్నాయన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top