దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో సగం సీట్లు ఖాళీ.. ఇందుకు భిన్నంగా ఏపీ

AICTE Report: Half Of Seats Vacant In Engineering Colleges India - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ , సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో సగం సీట్లు భర్తీ కావడంలేదు. గత పదేళ్లుగా కన్వీనర్‌ కోటాతోపాటు మేనేజ్‌మెంట్‌ కోటాలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీల్లో మినహా చాలా కాలేజీల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోతున్నట్టు ఏఐసీటీఈ గణాంకాలు చెబుతున్నాయి. ఏఐసీటీఈ ఏటా ప్రకటించే గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 40 నుంచి 48 శాతం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. 2013–14లో 39 శాతం సీట్లు మిగిలిపోగా, 2016–18 నాటికి 48 శాతానికి పెరిగింది. ఆ తరువాత రెండేళ్లూ ఇదే పరిస్థితి.

కరోనా తరువాత చేరికలు కొంతమేర పెరగడంతో మిగులు సీట్లు 42 శాతానికి చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో మా­త్ర­మే గత మూడేళ్లుగా 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌ కన్వీనర్‌ కోటా­లో 85 శాతం సీట్లు భర్తీ అవడం విశేషం. ఇన్‌టేక్‌ తగ్గినా చేరికలు మాత్రం అంతే వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య గత పదేళ్లలో భారీగా తగ్గింది. పదేళ్లక్రితం 30 లక్షల నుంచి 31 లక్షల వరకు సీట్లు ఉండగా ఇప్పుడది 23 లక్షలకు తగ్గింది. సీట్ల సంఖ్య తగ్గినా చేరికల్లో మాత్రం మార్పు లేదు.

గతంలో పలు విద్యా సంస్థలు సదుపాయాలు లేకున్నా కోర్సులకు అనుమతులు తెచ్చుకొనేవి. వీటివల్ల సాంకేతిక విద్య నాసిరకంగా మారుతుండడంతో సదుపాయాలున్న వాటికే ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ప్రమాణాల మేరకు సదుపాయాలు లేకున్నా, చేరికలు వరుసగా మూడేళ్లు 25 శాతానికి లోపు ఉన్నా వాటికి అనుమతులను రద్దు చేస్తోంది. దీంతో పలు కాలేజీలు మూతపడ్డాయి. కంప్యూటర్‌ సైన్సు సీట్లకే డిమాండ్‌ విద్యార్థులు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కంప్యూటర్‌ సైన్సు, తత్సంబంధిత కోర్సులవైపు దృష్టి సారిస్తున్నారు. దానికోసం కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా వెనక్కు తగ్గడం లేదు.

ఇతర కోర్సుల్లో చేరికలు అంతంతమాత్రమే. ఒకప్పుడు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సుకే పరిమితమైన ఈ డిమాండ్‌ ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెరి్నంగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), బ్లాక్‌ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్‌ అండ్‌ డిజైన్, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), బిగ్‌ డేటా వంటి అంశాలలో నేరుగా లేదా కాంబినేషన్లో వివిధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి బోధనకు అవసరమైన సదుపాయాలను కొన్ని ప్రముఖ కాలేజీలు మాత్రమే కల్పిస్తున్నాయి. మిగతా కళాశాలలు సంప్రదాయ కోర్సులతోనే నెట్టుకొస్తున్నాయి.

సంప్రదాయ కోర్‌ గ్రూప్‌ కోర్సుల వైపు విద్యార్థులను మళ్లించడానికి ఇతర అంశాలను వీటికి మైనర్‌ కోర్సులుగా జతచేయాలని ఏఐసీటీఈ ఆలోచిస్తోంది. ఈ కోర్సుల్లోని నూతన అంశాలపై అధ్యాపకులకు శిక్షణ కూడా ఇస్తోంది. లెక్చరర్ల కోసం ఇంటర్న్‌షిప్‌ కోర్సులు కూడా నిర్వహిస్తోంది.

రాష్ట్రంలో చేరికలు 80 శాతం పైనే
దేశంలోని పరిస్థితులకు భిన్నంగా రాష్ట్రంలో చేరికలు 80 శాతానికి పైగా ఉండటం విశేషం. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యలతో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. ఆర్థిక భారం లేకపోవడంతో విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.20 వేలు అదనంగా ఇస్తున్నారు.

ఇంజనీరింగ్‌ సిలబస్‌ను సంస్కరించి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త అంశాలను జోడించారు. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ, సర్టిఫికేషన్‌ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.9051.57కోట్లు అందించారు. దీని ద్వారా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కోర్సులకు చెందిన 24,74,544 మంది విద్యార్థులకు మేలు చేకూరింది.

జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు రూ.3,349.57కోట్లు అందించగా 18,77,863 మందికి లబ్ధి చేకూరింది. కాలేజీలకు న్యాక్‌ గుర్తింపును తప్పనిసరి చేశారు. ప్రమాణాలు మెరుగుపరుచుకోని కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తున్నారు. గత ఏడాది ప్రవేశాలు సరిగా లేని 28 కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేశారు. ఒక్క విద్యార్థీ చేరని మరో 22 కాలేజీల అనుమతులు రద్దు చేశారు. దీంతో కాలేజీల్లో వసతులు, బోధనలో నాణ్యత మెరుగుపడుతున్నాయి.

ఈ చర్యలతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరంలో కన్వీనర్‌ కోటా సీట్లు 1,13,403 కాగా, అందులో 95,968 (85 శాతం) భర్తీ అయ్యాయి. యాజమాన్య కోటా, స్పాట్‌ అడ్మిషన్లతో పాటు చూస్తే 1,21,836 (76 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. గత నాలుగేళ్ల గణాంకాలు చూస్తే ఏటా భర్తీ అయ్యే సీట్ల సంఖ్య పెరుగుతుండడం విశేషం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top